
సమగ్ర విపత్తు నిర్వహణలో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం వ్యవస్థ(భౌగోళిక సమాచార వ్యవస్థ), రిమోట్ సెన్సింగ్‌ల పాత్ర కీలకమైంది.
- ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానం పెరిగే కొద్దీ విపత్తు పూర్వ, విపత్తు సమయ, విపత్తు అనంతర నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
- నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం భూమి ఉపరితలంపై వివిధ స్థానాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి, నిల్వ చేసి, పరిశీలించి, ప్రదర్శించే కంప్యూటర్ వ్యవస్థను జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం అంటారు.
- ఒకే మ్యాప్ లేదా పటంపై భిన్న రకాల సమాచారాన్ని జీఐఎస్ ప్రదర్శించగలుగుతుంది.
- భూమిపై వివిధ ప్రాంతాల్లోని అంశాల మధ్య తులనాత్మక అంచనాలకు జీఐఎస్ ఉపకరిస్తుంది. ఉదాహరణకు జీఐఎస్ ద్వారా ఒకే పటంపై కాలుష్యం సంభవిస్తున్న ప్రాంతాలను, ఆ కాలుష్యం ద్వారా దెబ్బతినే చిత్తడి నేలలను ఒకేసారి ప్రదర్శించడానికి వీలవుతుంది. అలాంటి పటం ద్వారా ఏ చిత్తడి నేలలు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నదీ తెలుసుకోవచ్చు.
- ఇదే విధంగా పట్టణాల్లో వరదలు సంభవిస్తే త్వరగా ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించవచ్చు.
- ఒకే ప్రాంతానికి చెందిన ఏ సమాచారాన్ని అయినా జీఐఎస్ ఉపయోగించగలదు. రేఖాంశాలు, అక్షాంశాలకు అనుగుణంగా అదేవిధంగా చిరునామా లేదా పిన్‌కోడ్ ఆధారంగా కూడా ప్రాదేశిక సమాచారాన్ని జీఐఎస్ అందిస్తుంది.
- జనాభా, ఆదాయం, విద్యా స్థాయిల్లో ప్రజల సమాచారాన్ని వృక్షజాలం, నేల రకాలు, నదులు, వాగులు, ఇళ్లు, పాఠశాలలు, తదితర సమాచారాలను జీఐఎస్ అందిస్తుంది.
- భూమి నుంచి కొన్ని వందల కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్ష్యల్లోని ఉపగ్రహాల సాయంతో ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించి పరిశీలించడమే రిమోట్ సెన్సింగ్.
- భూమి ఉపరితలంపై పడే సౌర కాంతి పరావర్తనం చెందినప్పుడు, ఆ కిరణాలను సేకరించి భూమి ఉపరితలాన్ని చిత్రీకరించేందుకు రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల్లో ప్రత్యేక సెన్సార్లు ఉంటాయి.
- విపత్తు నిర్వహణలో అంతరిక్ష ఆధారిత సేవలు అందిస్తున్న దాదాపు ప్రతి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జీఐఎస్, రిమోట్ సెన్సింగ్ను ఉపయోగిస్తున్నాయి.
- విపత్తు సమయంలో పరిస్థితిని సమీక్షించి, సరైన నిర్ధారణ నమూనాలను రూపొందించి అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసి, ప్రాదేశిక డేటా బేస్‌లను రూపొందిస్తారు.
- రిమోట్ సెన్సింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విపత్తు తీవ్రతను అంచనా వే యడంలో భూకంపాలు, వరదలు, తుపాన్లు, కరువు వంటి విపత్తుల ప్రభావాలను గుర్తించి అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.
- విపత్తు నివారణ దశలో జీఐఎస్‌ను ఉపయోగించి, విపత్తు బారిన పడే అవకాశాన్ని, ప్రమాద తీవ్రతను అంచనా వేయడానికి, భారీ స్థాయి సమాచారాన్ని నిర్వహించేందుకు జీఐఎస్‌ను ఉపయోగిస్తారు.
- విపత్తు సంసిద్ధత సమయంలో జీఐఎస్‌ను విపత్తు బారిన పడిన వారిని ప్రమాదం నుంచి రక్షించడానికి మార్గాలను సిద్ధం చేయడం.
- ఉపగ్రహ సమాచారాన్ని ఇతర రకాల సమాచారంతో అనుసంధానించి విపత్తు హెచ్చరిక వ్యవస్థలను రూపొందించడం.
- విపత్తు స్పందన సమయంలో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్‌ను జీఐఎస్‌తో కలిపి సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడం.
- ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం.
- విపత్తు అనంతరం పునరుద్ధరణ సమయంలో నష్ట సమాచారాన్ని సేకరించి క్రమబద్దీకరించడంలో ఉపయోగిస్తారు. అభివృద్ధి ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులు, విపత్తుల సమాచారాన్ని సేకరించడంలో వినియోగిస్తారు.