తెలంగాణలో ప్రతిపక్షం బలపడిందా..?

తెలంగాణలో ప్రతిపక్షం బలపడిందా..?

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత విలువైనది. ప్రజల పక్షాన సమస్యలను వెలికి తీయడం.. వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయడం ప్రతిపక్షాల కర్తవ్యం. చట్టసభల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, చట్టసభల వేదికగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీయటం.. విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలకు సూచనలు చేయటం వాటి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల పనితీరు ప్రతిపక్షాలు పోషించే క్రియాశీలక పాత్రపై ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ ఎనిమిదేండ్లపాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ​ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఉనికి లేకుండా చేయడంలో కొంత విజయం సాధించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్​ రెండు జాతీయ పార్టీలు ప్రజాసమస్యలపై పోరాటం మొదలుపెట్టాయి. మరో ఏడాదిన్నరలో వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల స్థాయి ఎలా ఉంటుందన్నది వేచి చూడాలి. 

చట్టసభల్లో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలుగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్, అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన మద్దికాయల ఓంకార్ తమ ప్రశ్నలతో ప్రభుత్వాలను గడగడలాడించి ప్రతిపక్ష నేతలుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.1990 వరకు పార్లమెంటులో అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడే పక్షాలను, పార్టీలను చూశాం కానీ గత రెండు దశాబ్దాలుగా రాజకీయాలు పూర్తిగా ప్రజలకు దూరంగా జరుగుతున్నాయి. ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా పార్టీల కోసం, పదవుల కోసం, వ్యక్తిగత లబ్ధికోసం చట్టసభలను ఉపయోగించుకునే వారు ఎక్కువ అయిపోయారు. ప్రజల కోసం పోరాడిన వారిని కాకుండా క్రిమినాలిటీ, క్యాస్ట్, క్యాష్ తో, క్యారెక్టర్ లేకుండా రాజకీయాలు చేస్తున్నవారు చట్టసభలకు ఎన్నిక కావటం వల్ల చట్టసభల ఔన్నత్యం దెబ్బతింటోంది. 

ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్షాల పాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు వామపక్ష పార్టీలు ప్రధాన ప్రతిపక్షం పాత్రను పోషించాయి. కానీ తెలుగుదేశం ఆవిర్భావం తరువాత రాజకీయాలు మారిపోయాయి. అప్పటి వరకు రాజకీయంగా తిరుగులేని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం రూపంలో బలమైన రాజకీయ సవాల్ ఎదురైంది.1983 నుంచి 2014 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికార ప్రతిపక్ష పాత్రను  పోషించాయి. నర్సంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మద్దికాయల ఓంకార్ ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1999 నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోషించిన పాత్ర కీలకమైనది. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష రాజకీయాల్లో ఒక కీలక ఘట్టమనే చెప్పాలి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చిన అనుమతికి వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం చేసిన పోరాటం, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మైలురాళ్లుగా మిగిలిపోయాయి.

తెలంగాణలో ప్రతిపక్షం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ ఎనిమిదేండ్ల కాలంలో ప్రతిపక్షాలకు ఉనికి లేకుండా చేయడంలో పాలకపక్షం కొంత విజయం సాధించిందనే చెప్పాలి. 2014 మొదటి శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్​పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించింది.  అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం వల్ల రాజకీయ సమీకరణాలు మారి ప్రజల తరఫున పోరాడాల్సిన ప్రతిపక్షం బలహీనమైంది. 2018లో జరిగిన రెండో శాసనసభ ఎన్నికల్లో అధికార టీఆర్​ఎస్​పార్టీ 88 శాసనసభ స్థానాలు గెలుచుకుంది. శాసనసభలో తన బలాన్ని పెంచుకున్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించడంతో ప్రస్తుత శాసన సభలో పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరించే ఎంఐఎం పార్టీనే రెండవ అతిపెద్ద పార్టీగా మారింది. ప్రస్తుత శాసన సభలో ప్రతిపక్షాల బలం కేవలం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కలిపి 9 మాత్రమే. ఈ శాసన సభలో వామపక్షాలకు ప్రాతినిధ్యమే లేదు. శాసనసభలో బలంలేని ప్రతిపక్ష పార్టీలు తమ వాణిని బాణిని బలంగా వినిపించ లేకపోతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రజా సమస్యలపైన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతున్నా.. పాలకపక్షం బలం ముందు నిలబడలేకపోతున్నాయి. ఇలా అధికార పార్టీ ప్రతిపక్షాలను బలహీనంగా మార్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం చేసినా, విద్యుత్ చార్జీలు, బస్ చార్జీలు పెంచినా ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచినా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయకపోయినా, ధాన్యం కొనుగోళ్ల  విషయంలో రాజకీయం చేసినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, అవినీతి, అక్రమాలు జరుగుతున్నా, ఎన్నికల హామీలను నెరవేర్చక పోయినా అధికార పార్టీకి చెల్లుబాటు అవుతోంది. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టినట్లే.. ప్రజా సమస్యలను ప్రభుత్వాల ముందు పెట్టేందుకు ప్రతిపక్షాలు మరింత కృషి చేయాలి. దూషణలు, వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టసభల వేదికగా ప్రభుత్వాలను నిలదీసి క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలను నిర్మించే బలమైన ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రానికి అవసరం.

జాతీయ పార్టీలు వర్సెస్​ ప్రాంతీయ పార్టీ
దక్షిణ భారత రాజకీయాలు విలక్షణమైనవి. ఒకప్పుడు జాతీయ పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలు అండగా నిలబడితే, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా బలమైన పునాదులు వేసుకున్నాయి. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన పార్టీలుగా రాజకీయంగా నిలబడ్డాయి. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంది. కర్నాటకలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్​కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ, తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే రెండూ ద్రవిడ ప్రాంతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక అధికార ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ కు రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి రెండు జాతీయ పార్టీలు ప్రత్యామ్నాయం కాగలుగుతాయా? జాతీయ ప్రయోజనాలే ఎజెండాగా పనిచేసే జాతీయ పార్టీలు.. ప్రాంతీయ ప్రయోజనాలే ఎజెండాగా పనిచేసే ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం  ఏమేరకు కాగలుగుతాయనేది చూడాలి. 

ప్రజాస్వామ్యమా పార్టీస్వామ్యమా?
ప్రభుత్వాలు ప్రజల కోసం విధానాలు రూపొందించాలి.. ప్రతిపక్షం ఆ విధానాలు సరిగా అమలు జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కానీ పార్టీలు అధికారమే పరమావధిగా పని చేస్తూ తమ బాధ్యతను మరచి పోతున్నాయి. ప్రజలు కేంద్రంగా పని చేయాల్సిన పార్టీలు ఎన్నికలు, అధికారం కోసం పని చేస్తున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం పార్టీస్వామ్యంగా మారిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలో నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ అధినాయకత్వాన్ని మెప్పించడానికి వారి మెప్పు పొందటానికి పని చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నవారు తగ్గిపోతున్నారు. తెలంగాణ లాంటి ఒక కొత్త రాష్ట్రానికి ప్రగతిశీల రాష్ట్రానికి సమర్థవంతమైన ప్రభుత్వంతో పాటు బలమైన ప్రతిపక్షం కావాలి. తెలంగాణ శాసనసభకు 2023లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం ప్రకారంగా రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఒక బలమైన ప్రతిపక్షం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మొదటి సారి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు బలంగా పోటీ పడుతున్నాయి. 

- డా. తిరునాహరి శేషు
అసిస్టెంట్ ప్రొఫెసర్, కేయూ