పోలీస్స్టేషన్ ముందే వ్యక్తిపై కత్తితో రౌడీషీటర్ దాడి

సెల్ ఫోన్ దొంగతనం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై కత్తితో దాడి చేశాడో రౌడీషీటర్. ఈ ఘటన పోలీస్ స్టేషన్ ముందే జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి సీరియస్ గా ఉందంటున్నారు డాక్టర్లు.

అసలేం జరిగింది..? 

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధాతునగర్ కు చెందిన మహ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి సోదరి ఇంట్లో నుంచి రౌడీ షీటర్ ఇబ్రహీం సెల్ ఫోన్ ను దొంగతనం చేశాడు. తమ ఫోన్ అడిగితే ఇవ్వకపోగా.. భయభ్రాంతులకు గురిచేయడంతో ఇబ్రహీంపై ఫిర్యాదు చేసేందుకు మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు బాధితులు. దీంతో తనపైనే ఫిర్యాదు చేస్తారా..? అన్న కోపంతో పోలీసు స్టేషన్ ముందే మహ్మద్ ఫిరోజ్ పై కత్తితో పలుమార్లు దాడి చేశాడు రౌడీషీటర్ మహ్మద్ ఇబ్రహీం. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. 

తీవ్ర గాయాలపాలైన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. మహ్మద్ ఫిరోజ్ పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. నిందితుడు ఇబ్రహీంపై గతంలో రెండు సార్లు పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లి వచ్చారని బాధితుడి సోదరుడు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.