- ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు
- రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి
- పంజాగుట్టలో ఘటన
హైదరాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ చనిపోయిన ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. బోరబండలోని వినాయకనగర్‌కు చెందిన ఎస్.పి. రమ్య (40) ఎర్రమంజిల్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో హౌస్ కీపర్గాపనిచేస్తున్నది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. భర్త రవి అనారోగ్యంతో బాధపడుతుండగా.. కుటుంబాన్ని ఆమె పోషిస్తున్నది. వారం రోజుల కిందట రమ్య బుద్వేల్‌లో ఉండే తన అన్న నర్సింగ్ ఇంటికి వెళ్లింది. మంగళవారం ఉదయం నర్సింగ్ ఆమెను మెహిదీపట్నం బస్టాప్‌లో డ్రాప్ చేశాడు.
అక్కడి నుంచి బస్సులో పంజాగుట్టకు బయలుదేరింది. ఉదయం 9.30 గంటలకు పంజాగుట్ట క్రాస్ రోడ్ లో బస్సు దిగింది. అక్కడి నుంచి ఎర్రమంజిల్ వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న రమ్యను జగద్గిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. రమ్య బస్సు కింద పడిపోగా.. ఆమెపై నుంచి టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. నర్సింగ్ ఇచ్చిన కంప్లయింట్‌తో పంజాగుట్ట పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.