- టూరిజం గెస్ట్ హౌజ్ కట్టలే..
- టెంపుల్ చుట్టూ రోడ్డు వేయలే..
- నిరుడు జాతర సమీక్షలో ఎన్నో హామీలిచ్చిన మంత్రి ఎర్రబెల్లి
- రూ. కోట్ల ఆదాయం వస్తున్నా పనులపై నిర్లక్ష్యం
హనుమకొండ, ఐనవోలు, వెలుగు: కోరిన కోర్కెలు తీర్చే ఐనవోలు మల్లికార్జునస్వామి క్షేత్రాన్ని పాలకులు పట్టించుకోవడం లేదు. ఏటా జాతర సమయంలో ప్రజాప్రతినిధులు మీటింగులు పెట్టి హామీలు గుప్పించడం.. ఆ తరువాత లైట్ తీసుకోవడం పరిపాటిగా మారింది. ఆలయం ద్వారా ఏటా రూ.కోట్ల ఆదాయం సమకూరుతున్నా.. అభివృద్ధిని పట్టించుకునే నాథుడే లేడు. జాతర సమయంలోనే తాత్కాలికంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
మంత్రి హామీలన్నీ అట్లనే ఉన్నయ్..
గతేడాది జాతర ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రివ్యూ నిర్వహించి ఆలయాభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గెస్ట్ హౌజ్, హరిత హోటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం హైవే నుంచి ఐనవోలుకు డబుల్రోడ్డు, డార్మెటరీ హాల్ నిర్మిస్తామన్నారు. కుడా ఫండ్స్ రూ.కోటితో నాలుగు సులభ్ కాంప్లెక్సులు, రూ.50 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.1.5 కోట్లతో షాపింగ్కాంప్లెక్స్, రూ.2 కోట్లతో ఆలయం చుట్టూ రోడ్డు సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో కంప్లీట్ చేస్తామని చెప్పినా, నేటికీ అందులో ఒక్క పని కూడా మొదలుపెట్టలేదు.
సౌలతులు లేక ఇబ్బందులు..
ఆలయ ఆవరణలో భక్తులకు తాగు నీటి సదుపాయం లేదు. ఇదే అదునుగా వ్యాపారులు అధిక రేట్లకు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. వీటిని కొనలేక భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయ సమీపంలో శాశ్వత టాయిలెట్లు కూడా లేవు. కేవలం జాతర సమయంలోనే టెంపరరీ టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లేక చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానానికి ఏటా సగటున రూ.2 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతున్నా సౌలతులు మాత్రం కల్పించడం లేదు.
వచ్చే నెల బ్రహోత్సవాలు..
గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మ సమేతంగా కొలువైన మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి వరంగల్ తోపాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఏటా మకర సంక్రాంతి సమయంలో ఐలోని మల్లన్న జాతర జరుగుతుంది. ఈ సారి వచ్చే నెల 13న స్వామివారి బ్రహోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు 10లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇయ్యాల మంత్రి రివ్యూ..
బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇయ్యాల రివ్యూ చేయనున్నారు. ఈమేరకు ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్చీలను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభిస్తారని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి రివ్యూ ఉంటుందని వివరించారు.