సహాయక చర్యల్లో పాలకులు విఫలం: మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి

మునగాల, వెలుగు : సహాయక చర్యల్లో పాలకులు విఫలమయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి విమర్శించారు. మంగళవారం కోదాడ నియోజకవర్గంలోని నడిగూడెం మండలం రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వ గండి పడిన ప్రదేశాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. సీఎం రేవంత్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై నిందలు మోపడం విడ్డూరంగా ఉందన్నారు.

 సాగర్ ఎడమ కాల్వ గండి పాపం ఖమ్మం జిల్లా మంత్రులదేనన్నారు. ఖమ్మం ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చాకే మంత్రులు తేరుకున్నారని చెప్పారు. అంతా అయిపోయాక కాంగ్రెస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు,  సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద , పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు , మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, డాక్టర్​గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.