- గజ్వేల్ ప్రజలను కేసీఆర్ వలస పోనిస్తడా
- పాలకులు ..నడిగడ్డ ప్రజలను పట్టించుకుంటలేరు
- బహుజన రాజ్యాధికార యాత్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అయిజ, వెలుగు : ఇప్పటికీ నడిగడ్డ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోయి ప్రమాదాల్లో చనిపోతున్నారని, కేవలం ఈ ప్రాంత ప్రజలే ఎందుకు వలస పోతున్నారో ఆలోచించాలని, అదే గజ్వేల్ నుంచి ప్రజలను కేసీఆర్ వలస పోనిస్తారా అని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బుధవారం గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఉప్పల, ఉప్పల క్యాంప్ గ్రామాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు.
ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ 75 ఏండ్లుగా పాలకులు మన ప్రాంత ప్రజలు, రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఆర్డీఎస్ కాలువపై బ్రిడ్జీలు ఎందుకు నిర్మించడం లేదన్నారు. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకొని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేశవరావు, నియోజకవర్గ ఇన్చార్జి మధు గౌడ్, మహిళా ఇన్చార్జి నాగజ్యోతి, రాంచంద్రం పాల్గొన్నారు.
కేసీఆర్ అందుకే మాట్లాడుతలేడు
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి కృష్ణయ్య బిహార్ లో కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు హత్యకు గురైతే..ప్రస్తుత బిహార్ ప్రభుత్వం రూల్స్ మార్చి హత్య చేసిన దోషిని విడుదల చేస్తోందని ప్రవీణ్‌కుమార్ అన్నారు. కలెక్టర్ ను హత్య చేసిన వ్యక్తిని విడుదల చేయడంపై అన్ని పార్టీల నాయకులు మాట్లాడినా కేసీఆర్ మాత్రం స్పందించడం లేదన్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నారని, అందుకు నితీష్ కుమార్ మద్దతు కావాలి కాబట్టే మాట్లాడడం లేదన్నారు.