కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి జోరుగా వలసలు 

  • జగిత్యాల, కోరుట్లలో చేరికలపై స్పెషల్ ఫోకస్
  • కారు దిగుతున్న ముఖ్య నేతలు 
  • ఇటీవల అధికార పార్టీలో చేరిన చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ జ్యోతి, ముగ్గురు కౌన్సిలర్లు 
  • చేరికలతో క్యాడర్ దెబ్బతినకుండా కాంగ్రెస్​ హైకమాండ్​ అడుగులు

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలో అధికార కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లోకి వలసలు పెరిగాయి. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇమడ లేక.. పార్టీ మారలేక సతమతమైన ఆ పార్టీ నేతలు హైకమాండ్ పై తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు. ఇన్నాళ్లు తమను పట్టించుకోలేదన్న అభిప్రాయంలో ఉన్న నేతలంగా హస్తంపార్టీలోకి జంప్  అవుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు.

లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు ముందే అధికార పార్టీలో చేరితే ప్రయోజనం ఉంటుందన్న యోచనలో కారు పార్టీ లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గ నుంచి భారీగా చేరికలు కాగా, జగిత్యాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడువాల జ్యోతి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరి మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ పదవి దక్కించుకున్నారు. మరో ముగ్గురు ఆమె వెంట నడిచారు. ఇదే జోష్ లో కొందరు సీనియర్ లీడర్లు, ఉద్యమకారులు అధికార పార్టీలో చేరారు. 

లోకల్‌‌‌‌‌‌‌‌ లీడర్లంతా జంప్‌‌‌‌‌‌‌‌?

అధికారంలో ఉండగా తమ నిర్ణయాలకు విలువ ఇవ్వలేదని, ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో అదే పరిస్థితి ఉందని ఆరోపిస్తూ  కొందరు పార్టీని వీడుతున్నారు. మరికొందరు ఉందామా.. పోదామా అనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే మెట్‌‌‌‌‌‌‌‌పల్లి బీఆర్ఎస్  కౌన్సిలర్లు మర్రి సహదేవ్, పిప్పెర లలిత, చర్లపల్లి లక్ష్మి, బీజేపీ కౌన్సిలర్ జక్కని సుజాత, కోఆప్షన్ మెంబర్లు మార్గం గంగాధర్, పన్నాల మాధవ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.

అలాగే కోరుట్లలో మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్, కౌన్సిలర్లు శీలం జయలక్ష్మి, ఆడెపు కమల, ఎంబేరి నాగ భూషణం, లోకిని వెంకటేశ్, సంగ మాలతి, లీడర్లు ఆడెపు మధు, సంగ లింగం, ధర్మారం ఎంపీటీసీ నాగిరెడ్డి సుభాష్ రెడ్డి, మోహన్‌‌‌‌‌‌‌‌రావుపేట ఎంపీటీసీ కారుకురి నర్సయ్య కూడా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. 

చేరికలపై స్పెషల్ ఫోకస్ 

అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో ప్రస్తుతానికి చేరికలపై ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం. సంజయ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విజయం సాధించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో చేరికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల కాంగ్రెస్ మద్దతుతో జగిత్యాల బల్దియా పీఠం దక్కించుకున్న బీఆర్ఎస్ రెబల్ అడువాల జ్యోతి, ముగ్గురు కౌన్సిలర్లు, తన అనుచరవర్గంతో ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆధ్వర్యంలో చేరారు.

అలాగే బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు మున్సిపల్ మాజీ చైర్మన్ దేశాయి, మాజీ కౌన్సిలర్ భూమా గౌడ్,  సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నాయకులు హరిఅశోక్ కుమార్ తో పాటు దాదాపు 200 మంది బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా చేరికలతో పార్టీలో విభేదాలు రాకుండా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ హైకమాండ్‌‌‌‌‌‌‌‌ ఆచూతూచి అడుగులు వేస్తోంది.