పాలకపక్షం, ప్రతిపక్షం.. కలిస్తేనే ప్రభుత్వం.. రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా కొట్లాడాలి

  • నాకు ఎలాంటి భేషజాల్లేవ్​.. అందరి సలహాలు స్వీకరిస్త
  • మెట్రో విస్తరణ, ట్రిపుల్​ ఆర్​, రీజినల్ రింగ్ రైలుతోనే విశ్వనగరంగా 
  • హైదరాబాద్.. అందుకు బీజేపీ, బీఆర్​ఎస్​ నేతలు సహకరించాలి
  • ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం
  • ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత రాష్ట్రాభివృద్ధికే అంకితం
  • ప్రజాస్వామ్యమే మా విధానం.. అందుకే ఎంత ఇబ్బంది పెట్టినా అసెంబ్లీలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడ్నీ బహిష్కరించలే
  • స్టూడెంట్​ దశలో సిద్ధాంతపరమైన భావజాలం లేకే పార్టీ ఫిరాయింపులు
  • విద్యార్థి రాజకీయాలను పునరుద్ధరించాలి.. వర్సిటీలకు పూర్వవైభవం తేవాలి 
  • 50 ఏండ్ల రాజకీయ జీవితంలో మచ్చ లేని లీడర్​ విద్యాసాగర్​రావు
  • మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్​గా తెలంగాణకు గౌరవం తెచ్చారని ప్రశంస
  • విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షమని.. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వమని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ప్రజల మేలు కోసం ఎవరి పాత్రను వాళ్లు పోషించాలన్నారు. పాలకపక్షం నిర్ణయ విధానాల్లో ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్షం ప్రశ్నించాలని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, భాష  వంటి విషయాల్లో తమిళనాడులో పాలక, ప్రతిపక్షాలు ఏకతాటిపై ఉంటాయని గుర్తుచేశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, రాష్ట్రాభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తానని ఆయన పేర్కొన్నారు. 

మెట్రో విస్తరణ, రీజినల్​ రింగ్  రోడ్డు, రీజినల్​ రింగ్​ రైలు, ఇతర అభివృద్ధి అంశాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్​, బీఆర్​ఎస్​ లీడర్​ బోయినపల్లి వినోద్​రావు లాంటి వాళ్లు ముందుండాలని,  సహకరించాలని సీఎం కోరారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్‌‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని తాజ్​కృష్ణ హోటల్​లో సీఎం రేవంత్‌‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వన్ ట్రిలియన్ ఎకానమి గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న కోరిక ఉందని.. దేశం 5 ట్రిలియన్లకు వెళ్లే దాంట్లో తామూ భాగస్వామ్యం అవుతామన్నారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ నుంచి అనుమతులు ఇప్పించగల్గే నాయకులు ఈ వేదికపై ఉన్నారు. ప్రధానిని కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకుందాం” అని పిలుపునిచ్చారు. 

సిద్ధాంతపర భావజాలం లేకే ఫిరాయింపులు

అసెంబ్లీలో సీఎంకు ఎంత సమయం మైక్ ఇస్తారో ప్రధాన ప్రతిపక్ష నేతకూ అంతే సమయం మైక్ ఇస్తారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.  ప్రభుత్వం వైపు ట్రెజరీ బెంచ్​లకు, సభ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో..  ప్రతిపక్ష నాయకుడికీ అంతే స్థాయిలో ఉంటుందని తెలిపారు. ‘‘అసెంబ్లీలో ముఖ్యమంత్రితోపాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేలు చూపిస్తే.. స్పీకర్ మైక్ ఇచ్చే సంప్రదాయం ఉంది. ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువ.. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విషయాలు లేవనెత్తారు. కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు. పాలకపక్షం, ప్రతి పక్షం మధ్య ప్రతిష్టంభనను తొలగించడానికి నాడు విద్యాసాగర్ లాంటి వాళ్లు కృషి చేసేవాళ్లు.  ఏదైనా అంశంలో ఏకాభిప్రాయం రాకుండా అసెంబ్లీ వాయిదా పడితే పాలకపక్షం, ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేవి.  ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగించేలా మా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది” అని చెప్పారు. తాను సీఎం అయ్యాక 13 నెలల్లో సభలో ఎంత ఇబ్బంది పెట్టినా.. అసెంబ్లీ సజావుగా జరగాలని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వివిధ అంశాల్లో అభిప్రాయాలు, సూచనలు వినాలనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి ని చూపిస్తున్నదని.. ఎన్నికలప్పుడే రాజకీయాలని,  ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని సీఎం స్పష్టం చేశారు.  తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కారణమని ఆయన అన్నారు. ‘‘మా ప్రభుత్వం వచ్చే నాటికి యూనివర్సిటీలు ఉనికి కోల్పోయే విధంగా ఉన్నాయి.  యూనివర్సిటీల్లో వైస్ ఛాన్స్​లర్లను నియమించాం. యూనివర్సిటీలకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన రాజకీయ చర్చలు, చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతపరంగా లేకపోతే చైతన్యం కోల్పోతాం. అందులో భాగంగానే  ఏదో ఒక పదవి ఉంటే చాలు అంటూ పార్టీలు మారుతున్నారు.  విద్యార్థి రాజకీయాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే అభివృద్ధిలో వెనకబడి పోవాల్సి వస్తది” అని సీఎం పేర్కొన్నారు. 

తుమ్మిడిహెట్టికి విద్యాసాగర్​ అనుభవం అవసరం

గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు పాదయాత్ర చేశారని సీఎం రేవంత్​ రెడ్డి గుర్తుచేశారు. ‘‘గోదావరి జలాలు తెలంగాణకు వినియోగించుకోవాలంటే విద్యాసాగర్ రావు అనుభవం అవసరం. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఉన్నారని.. తుమ్మిడి హెట్టి వద్ద భూసేకరణ కోసం విద్యాసాగర్ రావు అవసరం ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్ జీ పాదయాత్ర చేశారు. గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత , చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువచ్చారు. అయినా గోదావరి జలాల వినియోగం సంపూర్ణంగా పూర్తికాలేదు. సాగర్​ జీ  అనుభవం మనకు అవసరం. మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని గతంలో నేను సాగర్ జీని కోరాను. తుమ్మడిహెట్టి వద్ద భూ సేకరణ కోసం ఎవరి వద్దకైనా వెళ్తా.. నాకు భేషజాలు లేవు’’ అని సీఎం స్పష్టం చేశారు.  మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్‌‌గా పనిచేసి విద్యాసాగర్ రావు  తెలంగాణ సమాజానికి గౌరవం తెచ్చారని.. ఆదర్శ నాయకుడిగా నిలిచారని కొనియాడారు. 50 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎటువంటి ఆరోపణలు, మచ్చ లేకుండా కొనసాగడం విద్యాసాగర్​రావు వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయం నుంచి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. విద్యాసాగర్ రావు సమర్థతను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవకాశం ఇచ్చారని ఆయన తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో సిద్ధాంతపరంగా నాడు రాజకీయాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో రెండో తరంలో జైపాల్ రెడ్డి, విద్యా సాగర్ రావు, దత్తాత్రేయ ఉన్నారని..  మూడో తరంలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరని ఆయన అన్నారు. 

రాష్ట్రాభివృద్ధికి అందరూ సహకరించాలి

దేశం 5 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో ఒక ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ నుంచి ఇస్తామని.. అందుకోసం రాష్ట్రానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  ‘‘తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారాలంటే రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ కావాలని కోరిన. తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి డ్రైపోర్టు ఇవ్వాలని అడిగిన. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ప్రధాని సహకారం కోరిన. న్యూయార్క్, టోక్యో వంటి ప్రపంచ నగరాలతో హైదరాబాద్​ పోటీ పడాలి. ప్రపంచంతో హైదరాబాద్​ పోటీ పడాలంటే మెట్రో రైల్​కు అనుమతులు తెచ్చుకోవాలి. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ మెట్రోకు ప్రధాని మోదీ సహకరించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రధాని మోదీ బెంగళూరుకు  మెట్రో ఇచ్చారు. తెలంగాణ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేత వినోద్ రావు  లాంటి నాయకులు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి. కలిసికట్టుగా తెలంగాణ కోసం పనిచేయాలి.  రాబోయే సెంట్రల్​ కేబినెట్​ మీటింగ్​లో  హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వాలి” అని ఆయన అన్నారు. 

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్‌‌ సంక్రాంతి విషెస్

తెలుగు ప్రజలందరికీ సీఎం రేవంత్‌‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ, భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందని అన్నారు. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచటంతో పాటు వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదు సాయం, ఆహార భద్రతను అందించే కొత్త రేషన్ కార్డులు, గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసే నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందని తెలిపారు. ప్రతి సంక్షేమ పథకం అర్హులైన వారందరికీ చేరాలనేది తన  సంకల్పమని చెప్పారు. వ్యవసాయంతో పాటు ఉపాధి కల్పన,  పారిశ్రామిక రంగాలన్నింటా తెలంగాణ రాష్ట్రం తిరుగులేని పురోగమనం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగ సంబురాలు జరుపుకోవాలన్నారు. పతంగులు ఎగరవేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జూన్ 2లోపు స్కిల్స్ వర్సిటీ భవనం

విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు 75 ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. రూ.2,100 కోట్లతో టాటా సంస్థ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి ముందుకు వచ్చిందన్నారు.  జూన్ 2లోపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనం పూర్తవుతుందని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో పతకాలు తేలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులను వెలికి తీసేందుకు, వారికి శిక్షణనిచ్చేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. 2028 లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో బంగారు పతకాలు తెచ్చేలా లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 

స్వామి వివేకానందకు సీఎం నివాళి

స్వామి వివేకానంద162 వ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్యెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, పాలకుర్తి ఎమ్యెల్యే యశస్విని రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు జెట్టి కుసుమ కుమార్, రోహిన్ రెడ్డి ఉన్నారు.

నాడు రాజకీయ పార్టీల కన్నా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందుండి పోరాటం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒకప్పుడు విద్యార్థి సంఘాల పోరాటాల వల్లే ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేవి. కానీ,  మేం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉనికి కోల్పోయే స్థితిలోకి చేరాయి. అందుకే యూనివర్సిటీల్లో వైస్ చాన్స్​లర్లను నియమించాం. టీచింగ్​, నాన్​ టీచింగ్​ స్టాఫ్​ను నియమించాలని.. వర్సిటీల అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తామని వీసీలకు చెప్పాం. యూనివర్సిటీలకు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి. విద్యార్థి రాజకీయాలను పునరుద్ధరించాలి. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన రాజకీయ చర్చలు, చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. - సీఎం రేవంత్​రెడ్డి