గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ(ఆఎఫ్సీఎల్)లో కోట్ల విలువజేసే ఫ్లై యాష్(బూడిద) నిల్వలను రూలింగ్పార్టీ లీడర్లు క్యాష్ చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ సంస్థగా ఏర్పడి ఎలాంటి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో 2017 నుంచి బూడిద దందా కొనసాగిస్తున్నారు. నిర్మాణరంగంలో వాడే ఈ యాష్‌కు బయట టన్ను రేటు రూ.400 ఉండగా, ఇక్కడ మాత్రం ఫ్రీగా తరలిస్తూ ఇప్పటికే రూ.20 కోట్ల దాకా కాజేశారు. ఏనాడో చేసిన రూ.10 లక్షల డిపాజిట్‌ను, మధ్యలో వచ్చిన కరోనాను సాకుగా చూపి, 2022 జూన్ 28 నుంచి మరో 18 నెలల పాటు వర్క్ఆర్డర్ పొందారు. ఈ లెక్కన మరో రూ.10 కోట్ల విలువైన బూడిదను తరలించుకునేందుకు స్కెచ్వేశారు.
ప్రజా అవసరాల కోసమట..
రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ(ఎఫ్‌సీఐ)1980 నుంచి 1999 వరకు 19 ఏండ్ల పాటు బొగ్గు ఆధారంగా నడిచింది. ఆ సమయంలో బొగ్గును మండించడం ద్వారా వచ్చిన బూడిదను ఫ్యాక్టరీ ఆవరణలోని యాష్ పాండ్‌లలో భారీ ఎత్తున నిల్వ చేశారు. కాలక్రమంలో నష్టాల వల్ల ఫ్యాక్టరీ మూతపడగా, ప్రస్తుతం దీనిని గ్యాస్ ఆధారంగా పునరుద్ధరించి నడుపుతున్నారు. కాగా, గతంలో ఉన్న బూడిద నిల్వలపై కొందరు రూలింగ్పార్టీ లీడర్లు కన్నేశారు. ఇటుకల తయారీతో పాటు నిర్మాణరంగంలో విపరీతమైన డిమాండ్ఉండడంతో కాంట్రాక్ట్ ఫర్మ్‌గా ఏర్పడ్డ నేతలు, 2016లో ప్రజా అవసరాల కోసమంటూ నాటి కేంద్రమంత్రిని ఒప్పించి, వృథాగా ఉన్న బూడిదను తీసుకెళ్లేందుకు పర్మిషన్ తెచ్చుకున్నారు. ఎలాంటి రుసుము లేకుండా 2017 జనవరి నుంచి ఆరు నెలల పాటు 50 వేల క్యూబిక్ మీటర్ల బూడిదను తరలించేందుకు నామినేషన్ పద్ధతిన అప్పటి ఎఫ్‌సీఐ మేనేజ్‌మెంట్ వర్క్ ఆర్డర్ ఇచ్చింది. బూడిదను తీసుకెళ్లే క్రమంలో ప్లాంట్‌లోని మిషనరీని డ్యామేజ్ చేయడంతోపాటు స్క్రాప్‌ను ఎత్తుకెళ్లే అవకాశం ఉండడంతో కాంట్రాక్టు సంస్థ తో ఎఫ్‌సీఐ మేనేజ్‌మెంట్ రూ.10 లక్షల డిపాజిట్ చేయించుకున్నది. ఆనాటి నుంచి సదరు కాంట్రాక్టు సంస్థ ఎఫ్‌సీఐ ప్లాంట్‌లోని బూడిదను లారీల ద్వారా తరలించి కోట్లు సంపాదించింది. అప్పటికి ఎఫ్‌సీఐ మూతపడి ఉన్నప్పటికీ దాని రిటైర్డ్ అధికారులు కన్సల్టెంట్ గా ఉండి సదరు కాంట్రాక్టర్ తో మిలాకత్ అయి టెండర్ పొడిగించుకుంటూ వచ్చారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కో లారీకి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు సొమ్ము చేసుకున్నారు. ఇలా మధ్యమధ్యలో ఎఫ్‌సీఐకి కన్సల్టెంట్‌గా ఉన్న ఆఫీసర్ల సహకారంతో బూడిద తరలించే కాంట్రాక్ట్‌ను ఎక్స్‌టెన్షన్ చేసుకుంటూ తమ పని కొనసాగించారు. 2020 మే నెలలో కూడా మూడు నెలలు ఎక్స్‌టెన్షన్ తీసుకున్నారు. కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో బూడిద తరలించడం సాధ్యం కాలేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టు సంస్థ తాజాగా కోర్టును ఆశ్రయించింది. తాము10 లక్షల డిపాజిట్ చేసి ఉన్నామని, కరోనా వల్ల బూడిదను తరలించడం సాధ్యం కానందున తిరిగి అనుమతివ్వాలని కోరింది. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి రాగానే ఎఫ్‌సీఐకి చెందిన డైరెక్టర్ల బోర్డు 2022 జూన్ 28వ తేదీ నుంచి 18 నెలల పాటు సుమారు రూ.10 కోట్ల విలువైన బూడిదను తరలించుకునేందుకు మరోసారి వర్క్ ఆర్డర్ ఇచ్చింది. 2017 జనవరిలో మొదలైన బూడిద తరలించే వర్క్ 2020 వరకు అంటే మూడేండ్ల పాటు నామినేషన్ పద్ధతిన కొనసాగడంపై సర్వత్రా విస్మయం
వ్యక్తమవుతోంది.
ఎన్టీపీసీలో రూ.402.. ఎఫ్‌సీఐలో ఉచితంగా..
ప్రస్తుతం ఇటుకల తయారీతో పాటు రోడ్లు, ఇతరత్రా నిర్మాణ అవసరాలకు బూడిద బంగారంలా మారింది. దీంతో రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద కోసం ఏటా టెండర్లు పిలుస్తోంది. ప్రస్తుత ఎన్టీపీసీలో బూడిదను దక్కించుకున్న కాంట్రాక్టర్ నుంచి టన్ను బూడిదకు రూ.402 చొప్పున ఎన్టీపీసీ వసూలు చేస్తోంది. అదేవిధంగా రామగుండం జెన్‌కో సంస్థ టన్ను బూడిదను రూ.172 చొప్పున విక్రయిస్తున్నది. కానీ ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లోని బూడిదను మాత్రం ఎఫ్‌సీఐ బోర్డు సదరు కాంట్రాక్టు సంస్థకు ఎలాంటి టెండర్ లేకుండా ఉచితంగానే తీసుకుపోవడానికి అనుమతించింది. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఆస్తులన్నీ ఆర్‌ఎఫ్‌సీఎల్ ఆధీనంలో ఉన్నా..
ఎఫ్‌సీఐకి చెందిన భూములు, ఆస్తులన్నీ ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ మేనేజ్‌మెంట్‌కు చట్టబద్ధంగా బదలాయింపు చేశారు. అలాగే ఈ భూములు, ఆస్తులను తాకట్టు పెట్టి ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద లోన్ తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఇటు ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్‌కు గానీ, అటు ఎస్‌బీఐ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్లాంట్ పరిధిలోని బూడిదను తరలించుకుపోయేందుకు కాంట్రాక్టు సంస్థ ఎక్స్‌టెన్షన్ కోరితే ఎఫ్‌సీఐలోని కన్సల్టెంట్బోర్డు అనుమతినివ్వడం వివాదాస్పదమవుతోంది. కాగా బూడిదను తీసుకుపోవడానికి అనుమతి ఇవ్వాలని ఎఫ్‌సీఐ బోర్డు ఇటీవల ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్‌కు లెటర్రాwసింది. అయితే ప్లాంట్ నడుస్తున్న క్రమంలో దాని భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని, అందువల్ల బూడిదను తరలించేందుకు అనుమతి ఇవ్వలేమంటూ తిరిగి ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్ బదులిచ్చింది. కానీ బూడిదను ఉచితంగానే తరలించుకుపోయేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు, కాంట్రాక్టర్లు ఆర్‌ఎఫ్‌సీఎల్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
బూడిద తీయాలంటే చెట్లకు ముప్పు...
ప్రస్తుత ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లోని పాత ఫ్యాక్టరీకి చెందిన బూడిదను నిల్వచేసిన మరో ప్రాంతంలో 10 నుంచి 15 సంవత్సరాలకు చెందిన చెట్లు వందకు పైగా ఉన్నాయి. నామినేషన్ పద్ధతిన ఎక్స్‌టెన్షన్ వర్క్ పొందిన కాంట్రాక్టు సంస్థ బూడిదను తరలించాలంటే దానిపైన ఉన్న చెట్లను తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ పెద్దపెద్ద చెట్లను నరికితే పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా అంతకుముందు బూడిద తీసిన ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా నిలిచాయి. ఇక్కడ కూడా మిగిలిన బూడిదను తీయాలంటే నీటిని తొలగించాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ఆర్‌ఎఫ్‌సీఎల్ గోడను పగలగొట్టి నీటిని బయటకు పంపాలి. ఈ పనిచేస్తే ప్లాంట్ పక్కనే ఉన్న కాలనీలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతికి విఘాతం కలిగేలా వ్యవహరిస్తూ, బూడిదను ఉచితంగా తరలిస్తూ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ఆర్ధికంగా నష్టపరుస్తున్న కాంట్రాక్టు సంస్థకు ఎక్స్‌టెన్సన్‌ను రద్దు చేయాలని, తిరిగి టెండర్ పిలవాలని స్థానికులు కోరుతున్నారు.