- మొత్తం నిధుల్లో కేంద్రానిది 60, రాష్ట్రానిది 40 శాతం
- మార్చి వరకు స్టార్ట్ చేసి, డిసెంబర్ లోపు పూర్తైన పనులకే బిల్లులు
- ఉమ్మడి జిల్లాలో రెండు క్లస్టర్లు
యాదాద్రి, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ‘రూర్బన్ పథకం’ నిలిచిపోయింది. ఈ స్కీంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో పనులు చేపట్టాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఈ స్కీమ్ నిలిచిపోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే ఈ సంవత్సరం మార్చి నాటికి స్టార్ట్ చేసిన పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేస్తేనే వాటికి బిల్లులు చెల్లిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికీ ఇంకా స్టార్ట్ కాని పనులు పూర్తిగా ఆగిపోయినట్లేనని తెలుస్తోంది. 2021 మార్చిలో ఫేజ్-1ను కంప్లీట్ చేసి, ఆ తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ చేయాలని నిర్ణయించారు.
ఉమ్మడి నల్గొండలో రెండు క్లస్టర్లు
రూర్బన్ స్కీం కింద తెలంగాణలో 17 క్లస్టర్లను ఎంపిక చేయగా ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు క్లస్టర్లు ఉన్నాయి. ఇందులో కొండభీమనపల్లి (దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లోని మండలాల్లోని 65 పంచాయతీలు), చౌటుప్పల్ (22 పంచాయతీలు) గిరిజన క్లస్టర్లుగా గుర్తించారు. ఈ రెండు క్లస్టర్లలోని 87 గ్రామ పంచాయతీల్లో డెవలప్‌మెంట్ వర్క్స్ చేసేందుకు కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2017 – 18 లో రూ. 30 కోట్లు మంజూరు చేశారు. కొండభీమనపల్లిలో 341 వర్క్స్ గుర్తించగా, వీటిలో 263 పనులు కంప్లీట్ అయ్యాయి. రూ.15 కోట్లలో రూ. 8.80 కోట్లు రిలీజ్ కాగా మరో రూ. 3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే చౌటుప్పల్ పరిధిలోని 256 పనులను గుర్తించగా రూ. 9 కోట్లతో 198 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో కొన్ని వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ఇంకా మొదలే కాలేదు.
రాష్ట్ర సర్కార్ ఫండ్స్ ఇవ్వకనే...
రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం వల్లే ఈ స్కీం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల రూ.25.82 కోట్లు రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఇప్పటివరకు పైసలు రాలేదని సమాచారం. ఫస్ట్ ఫేజ్‌లో గుర్తించిన పనుల్లో చాలా వరకు కంప్లీట్ కావడంతో ఫేజ్ 2 ప్రారంభిస్తారని అనుకుంటున్న టైంలో ఈ స్కీమ్‌నే ను మొత్తమే నిలిపేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మార్చి నాటికి వర్క్స్ స్టార్ట్ చేయడంతో పాటు డిసెంబర్ నాటికి కంప్లీట్ చేస్తే బిల్లులు చెల్లిస్తామని తెలిపింది. పంతంగిలో కూరగాయల మార్కెట్ పూర్తైనా బిల్లులు రాకపోవడంతో వాటిని కాంట్రాక్టర్లు అప్పగించలేదు. చిన్నకొండూరులోని మహిళలకు జ్యూట్, పేపర్ బ్యాగ్ తయారీతో ఉపాధి కల్పించేందుకు రూ. 25 లక్షలతో మిషన్లు తెప్పించాల్సి ఉండగా అదీ ఆగిపోయింది. హ్యాండ్లూమ్ క్లస్టర్‌తో 200 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని మగ్గాలు తెప్పించినా.. ట్రైనింగ్ ఇవ్వకపోవడంతో అవి వృథాగా ఉన్నాయి. మగ్గాలు ఉన్న రూం రెంట్ మహిళలే చెల్లిస్తున్నారు. చింతలగూడెం, దామెర పంచాయతీ బిల్డింగ్‌లు మధ్యలోనే ఆగిపోయాయి.
డీపీఎంలకు జీతాలూ రావట్లే
ఈ స్కీం కింద ఎంపికైన క్లస్టర్లలో డీపీఎంలుగా పనిచేస్తున్న 17 మందికి జీతాలు కూడా ఆగిపోయాయి. మార్చి 2022 నుంచి స్కీం నిలిచిపోయినందున ఇక నుంచి జీతాలు ఇవ్వమని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. జూన్ వరకు మాత్రమే జీతాలు ఇచ్చింది.దీంతో గ్రామీణాభివృద్ధి శాఖలో పనులు చేస్తున్న డీపీఎంలు తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో పడిపోయారు.