మహాకుంభనగర్ (యూపీ): ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ గురువారం పుణ్య స్నానమాచరించారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మహా కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాల గొప్ప సంగమం అన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం.. దేశాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పుణ్య స్నానమాచరించిన తర్వాత గంగా మాత, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్, పలువురు పార్టీ నేతలతో ఆయన కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం బీరెన్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కూడా తన కుటుంబంతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. మహా కుంభమేళా నిర్వహణ చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు.
సింధ్ నుంచి భక్తులు..
పాకిస్తాన్‌లోని సింధ్‌కు చెందిన 68 మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారు. శుక్రవారం పుణ్య స్నానమాచరించనున్నట్లు తెలిపారు. వీరిలో 50 మంది తొలిసారి కుంభ మేళాకు హాజరైనట్లు వివరించారు. రెండు, మూడు నెలల నుంచి మహా కుంభ గురించి వింటూ వచ్చామని ఓ భక్తుడు తెలిపాడు. నిరుడు ఏప్రిల్‌లో 250 మందితో కూడిన బృందం.. పాకిస్థాన్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిందని, గంగా నదిలో స్నానాలు ఆచరించిందని వివరించారు. సింధ్‌లోని ఆరు జిల్లాల నుంచి మహా కుంభ మేళాకు తరలివచ్చినట్లు తెలిపారు. హిందూ సంస్కృతి, సంప్రదాయమేంటో ఫస్ట్ టైమ్ కళ్లారా చూసినట్లు 11 ఏండ్ల అబ్బాయి వివరించాడు. ఇండియాకు రావడం కూడా తొలిసారి అని తెలిపాడు.