మిషన్ భగీరథలో కార్మికుల వెట్టి చాకిరి..

మిషన్ భగీరథలో కార్మికుల వెట్టి చాకిరి..

మహబూబ్​నగర్​, వెలుగు: మిషన్​భగీరథ పథకంలో అవుట్​సోర్సింగ్​ ఎంప్లాయిస్ కు నాలుగేండ్లుగా జీతాలు పెంచట్లేదు. పథకం స్టార్ట్​ చేసిన నాటి నుంచి ఇప్పటివరకు అవే జీతాలు తీసుకుంటున్నారు. ఆ కొద్దిపాటి జీతాలను కూడా కాంట్రాక్ట్​ కంపెనీలు ఐదారు నెలలకోసారి ఇస్తుండడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జీవో 11 ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,600 మంది అవుట్​సోర్సింగ్​కార్మికులు పని చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 1600 మంది  కార్మికులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2019 మార్చి నుంచి 'భగీరథ'ను ఇంప్లిమెంట్​ చేస్తున్నారు. భగీరథలో పనిచేసేందుకు లైన్​మెన్స్, ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్ ను మేఘా కంపెనీ అవుట్​ సోర్సింగ్ కింద స్కిల్డ్​, సెమీ స్కిల్డ్​ విభాగంలో కార్మికులను తీసుకుంది. అదే టైంలో నారాయణపేట జిల్లాలో ని సత్యసాయి స్కీంలో పనిచేస్తున్న 65 మందిని కూడా భగీరథలోకి తీసుకున్నారు. ఆపరేటర్లకు రూ.11,600, లైన్​మెన్లు, ఎలక్ర్టీషియన్లు, ఫిట్టర్లకు రూ.10,500 చొప్పున జీతాలు ఇస్తున్నారు. వీరిని నియమించి నాలుగేండ్లు కావస్తున్నా ఇప్పటివరకు జీతాలు పెరగలేదు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. 

కాంట్రాక్టా... అవుట్​సోర్సింగా.. 

స్కీంలో పని చేస్తున్న కార్మికులు ప్రస్తుతం తాము ఏ పరిధిలోని వర్కర్లమనే డైలమాలో ఉన్నారు. మేఘా కంపెనీ వీరిని ఏ ప్రాతిపదికన తీసుకున్నదో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆఫీసర్లు మాత్రం స్కిల్డ్​, సెమీ స్కిల్డ్​ కింద తీసుకున్నట్లు చెబుతున్నారు. దాని ఆధారంగా 107 జీవో ప్రకారం జీతాలు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ జీవో ప్రకారం జీతాలు రావడం లేదు. ఏటా నామ్​కే వాస్తేగా రూ.100 నుంచి రూ.400 మించి పెంచడం లేదు. జీవో ప్రకారం మినిమం శాలరీ రూ.26 వేలు ఇవ్వాలని.. లేదా జీవో 11 ప్రకారం తమను అవుట్​ సోర్సింగ్​ ఎంప్లాయిస్​ కింద గుర్తించాలని కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. 

ఐదారు నెలలకోసారి జీతాలు

2019 నుంచి కార్మికులకు మేఘా కంపెనీయే జీతాలు చెల్లించేది. కానీ జనవరి నుంచి కార్మికుల కాంట్రాక్ట్​ను వేరే సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్​ను ఎనర్జిటిక్​, వెంకటేశ్వర, చల్లా కంపెనీలు దక్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు ఎంప్లాయిస్​కు రెగ్యులర్​గా జీతాలు చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లాలో ఐదు నెలలుగా, నారాయణపేట జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని కార్మికులు చెబుతున్నారు. నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు కార్మికులు తెలిపారు. ఈకేవైసీ ప్రాబ్లమ్​ఉందని చెబుతూ ఇప్పటివరకు పీఎఫ్​ను వర్తింపజేయలేదని కార్మికులు చెబుతున్నారు.

లైన్​మెన్​ల పరిస్థితి అధ్వానం

స్కీంలో పని చేస్తున్న లైన్​మెన్​ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటర్​ సప్లైలో ఎక్కడ లీకేజీలు, పైపులు పగిలినా వీరు 24 గంటలు డ్యూటీలు చేయాల్సిందే. సమస్య ఉన్నదగ్గరికి వెళ్లి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు వారికి టీఏలు కూడా ఇవ్వడం లేదు. సొంత వాహనాల్లో వెళ్తుండటంతో నెలకు పెట్రోల్​కే రూ.3వేలకు పైగా ఖర్చవుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జీతంలో పావు వంతు పైసలు పెట్రోల్​కే పోతే, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని లైన్​మెన్​లు ప్రశ్నిస్తున్నారు. 

ఏడాదిన్నరగా చర్చలంటూ తిప్పుకుంటుండ్రు

కార్మికులు జీతాలు పెంచాలని డిమాండ్​ చేస్తున్నా కాంట్రాక్ట్​ ఏజెన్సీలు, ఆఫీసర్లు స్పందించడం లేదు. సమ్మెలకు దిగుతామని చెబితే అప్పటికప్పుడు కార్మికులను పిలిచించుకొని మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇలా ఏడాదిన్నరగా ఇప్పటివరకు ఐదు సార్లు ఆఫీసర్లు కార్మికులకు చర్చలకు పిలిపించి హామీలిచ్చి పంపించారు. ఈ నెల 15న సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించడంతో, ఇటీవల చర్చలు జరిపారు. మొత్తం 11 డిమాండ్లను కార్మికులు ఆఫీసర్ల ముందుంచారు. ఐడెంటీ కార్డులు, హెల్త్​ కార్డులు, పీఎఫ్​ వంటివి వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. జీతాల పెంపుపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై డిసెంబర్​ 15 వరకు టైం ఇవ్వాలని కోరడంతో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా ఆగిపోయారు. 

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

మిషన్​ భగీరథ స్కీంలో పని చేస్తున్న కార్మికులకు ఎస్ఎస్ఆర్​ ప్రకారం జీతాలు ఇవ్వాలి. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు గళం విప్పితే, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. అలా కాకుండా కార్మికులకు ఉద్యోగ భద్రతా కల్పించాలె. ప్రతి కార్మికుడికి వీక్​ఆఫ్​లు మంజూరు చేయాలె. జీవో 11 జీతాలు చెల్లించి, పీఆర్​సీని అమలు చేయాలి. ప్రతి కార్మికుడితో 8 గంటలే పని చేయించుకోవాలె. అదనపు గంటలు పని చేస్తే, దానికి ఓటీ చెల్లించాలె.
– నల్లవెల్లి కురుమూర్తి, సీఐటీయూ జిల్లా జనరల్​ సెక్రటరీ, మహబూబ్​నగర్

అగ్రిమెంట్​ ప్రకారం జీతాలు ఇయ్యాలె

గవర్నమెంట్​తో చేసుకున్న ఒప్పందం ప్రకారం మాకు జీతాలు ఇయ్యాలె. మినిమం వేజెస్​ కింద కూడా జీతాలు ఇస్తలేరు. మార్కెట్లో అన్ని రేట్లు పెరిగినయి. మా జీతాలు మాత్రం పెరగట్లేదు. ఇప్పుడిస్తున్న జీతాలతో మా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలె...
– శ్రీనివాసులు, ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయ్, మక్తల్​, నారాయణపేట