సన్నబియ్యం స్కీమ్​ .. పేదల కడుపు నింపేందుకే.. ఎన్ని కోట్లు ఖర్చయినా కొనసాగిస్తం : సీఎం రేవంత్

సన్నబియ్యం స్కీమ్​ .. పేదల కడుపు నింపేందుకే.. ఎన్ని కోట్లు ఖర్చయినా కొనసాగిస్తం : సీఎం రేవంత్
  • ఇది చరిత్రాత్మక పథకం.. 
  • దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డరు
  • ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నది 
  • సన్నబియ్యంతో ఈ దోపిడీ కూడా బంద్ అయితది 
  • మిల్లర్ల దగ్గర రూ.24 వేల కోట్ల వడ్లను కేసీఆర్ తాకట్టు పెట్టిండు 
  • రూ.లక్ష కోట్లు మింగి.. కూలేశ్వరం కట్టిండు 
  • కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత కాదు.. ఏకైక వింత అని కామెంట్ 
  • హుజూర్‌‌‌‌నగర్‌‌‌‌లో సన్నబియ్యం స్కీమ్‌‌ను ప్రారంభించిన సీఎం
  • హూజూర్‌‌‌‌నగర్‌‌‌‌కు వ్యవసాయ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటన 

హైదరాబాద్, వెలుగు: 
పేదలు ప్రతిరోజూ కడుపు నిండా తినాలన్న గొప్ప లక్ష్యంతో సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్‌‌ రెడ్డి తెలిపారు. ఇకపై ఉగాది లాంటి పండుగ రోజుల్లోనే కాదు.. ప్రతిరోజూ శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు తింటారని చెప్పారు. ‘‘తండాలు, మారుమూల గ్రామాల్లోనూ సన్నబియ్యం అందిస్తం. రాష్ట్రంలో అర్హులందరికీ పంపిణీ చేస్తం. రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 6 కిలోలు ఇస్తం. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. ఎన్ని కోట్లు ఖర్చయినా ఈ స్కీంను కొనసాగిస్తం. ఇది చరిత్రాత్మక పథకం. దీన్ని తీసేసే ధైర్యం ఏ ప్రభుత్వమూ చేయదు” అని పేర్కొన్నారు. 

ఆదివారం (March 31) సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన బహిరంగ సభలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి సన్నబియ్యం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అదే విధంగా మహిళా సంఘాలకు రూ.26.16  కోట్ల చెక్ అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉగాది రోజు ఈ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ‘‘సాయుధ రైతాంగ పోరాటం, రోటీ కపడా మకాన్, రూ.2కే కిలో బియ్యం తర్వాత.. సన్నబియ్యం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ఆషామాషీ పథకం కాదు. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి వచ్చినా దీన్ని రద్దు చేయలేరు” అని అన్నారు. చీమలదండులా, కృష్ణానది ఉప్పొంగిందా.. అన్నట్టు సభకు జనం వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. 

దొడ్డు బియ్యం తింటలేరు..  

పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజాపంపిణీ వ్యవస్థ ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘పీడీఎస్‌‌‌‌‌‌‌‌ను 70 ఏండ్ల క్రితమే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అమలు చేసింది. 1957లో దేశంలో మొదటిసారి జవహర్ లాల్ నెహ్రూ రేషన్ దుకాణాలు తీసుకొచ్చారు. పేదలకు తెల్లన్నం పెట్టాలని ఆనాడు సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి భావించారు. రూ.1.90కే కిలో బియ్యం ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత పేదల ఆకలి తెలిసిన వ్యక్తిగా 1983లో ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చారు. ఈ పథకంలో జానారెడ్డి కీలకపాత్ర పోషించారు” అని పేర్కొన్నారు. అయితే ఇన్ని రోజులుగా ఇస్తున్న దొడ్డు బియ్యంతో మిల్లర్లు, దళారులే బాగుపడ్డారని తెలిపారు. ‘‘దొడ్డు బియ్యం ఇస్తే చాలామంది తినడం లేదు. వాటిని అమ్ముకుంటున్నారు. ఆ బియ్యం మొత్తం మిల్లర్ల మాఫియా చేతిలోకి వెళ్తున్నాయి. 

మిల్లర్లు పేదల దగ్గర రూ.10కి కిలో కొని, అవే బియ్యాన్ని ప్రభుత్వానికి రూ.30కి అమ్ముతున్నారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతున్నది. ఇప్పుడు సన్నవడ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌తో ఈ దోపిడీ కూడా బంద్ అయితది” అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.24 వేల కోట్ల విలువైన వడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిందని మండిపడ్డారు.  

కాళేశ్వరం 8వ వింత కాదు.. ఏకైక వింత  

పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. ప్రాజెక్టులను పడావు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్ పడావు పెట్టారు. నల్గొండ రైతులపై పగబట్టి దాన్ని పూర్తి చేయలేదు. 34 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీని ఏడాదికి ఒక కిలోమీటర్ చొప్పున తవ్వినా అయిపోయేది. కానీ కేసీఆర్ చేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక పడావు పడిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం. 

అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం” అని తెలిపారు. ‘‘కేసీఆర్ లక్ష కోట్లు మింగి కూలేశ్వరం కట్టిండు. అది మూడేండ్లకే కూలిపోయింది. కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత కాదు.. ఏకైక వింత.. మిమ్మల్ని ఉరి తీసిన పాపం లేదు” అని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘2006లో జడ్పీటీసీగా రాజకీయం మొదలుపెట్టిన నేను.. 2024లో ముఖ్యమంత్రి అయ్యాను. కేసీఆర్ నా ఇంటి తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేయించాడు. ఆ తర్వాత 8 నెలలకే ఎంపీ అయ్యాను. ఇప్పుడు శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది’’ అని విమర్శించారు. 

పేదల గుండెల్లో ఇందిరమ్మ.. 

నాడు ఇందిరాగాంధీ తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేవుడి ఫొటో పక్కన ఇందిరమ్మ ఫొటో పెట్టుకునే సంస్కృతి తండాల్లో ఉందని పేర్కొన్నారు. ‘‘రైతుల గుండెల్లో ఇందిరమ్మ, సోనియమ్మ పేర్లు నిలిచిపోయేలా కార్యక్రమాలు చేస్తున్నాం. వడ్లు కొన్న మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. 15 నెలల్లో చేయగలిగిన కార్యక్రమాలన్నీ చేశాం.. ఇంకా చేస్తాం. కాళ్లలో కట్టె పెట్టి అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారు. వాళ్ల కళ్లలో కారం కొట్టడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం” అని చెప్పారు. హూజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

రైతుల ఖాతాల్లో33 వేల కోట్లు వేసినం..  

దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించి తెలంగాణ రైతులు రికార్డు సృష్టించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ఇప్పటికే రైతు భరోసా కింద రూ.5వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం. మిగిలిన రూ.4వేల కోట్లు త్వరలోనే వేస్తాం. రుణమాఫీ, రైతు భరోసా స్కీముల ద్వారా ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.33 వేల కోట్లు వేశాం” అని వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చి తీరుతామని చెప్పారు. సభలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్.. వరి వేస్తే ఉరేనన్నడు.. 

గతంలో వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ భయపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘80 వేల పుస్తకాలు చదివినోడు, మేధావి, తెలంగాణ గురించి అంతా తెలుసు అని చెప్పినోడు... సన్నబియ్యం ఇవ్వలేదు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిండు. వడ్లు కొనబోమని హెచ్చరించిండు. కానీ ఎర్రవల్లిలోని తన ఫామ్‌‌హౌస్‌‌లో వందల ఎకరాల్లో వడ్లు పండించిండు. వాటిని క్వింటాల్‌‌కు రూ.4,500 చొప్పున అమ్ముకున్నడు” అని కేసీఆర్‌‌‌‌పై ఫైర్ అయ్యారు. 

నాడు వడ్లు పండిస్తే కొనేవాడే లేడని, ఇప్పుడు రైతులు పండించిన ప్రతి గింజనూ తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. సన్నొడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌‌కు రూ.రూ.500 చొప్పున బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. నల్గొండ జిల్లా రైతులకే అత్యధికంగా బోనస్ అందిందని పేర్కొన్నారు.