
నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం (ఏప్రిల్ 1) కనగల్ మండలం జి .ఎడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అలాగే.. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 4 కోట్ల 63 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పేదలు సైతం సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 20 లక్షల మంది పేర్లు రేషన్ కార్డులలో చేర్చిందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా వంటి హామీలను అమలు చేశామని గుర్తు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు 4 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు ఇచ్చిందని.. నల్లగొండ జిల్లా జీవనాడి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పెండింగ్ పనులకు రూ.4,518 కోట్లు బడ్జెట్లో కేటాయించామని.. టన్నెల్ మిషన్ చెడిపోతే అమెరికా నుండి తెప్పించామని పేర్కొన్నారు.
రెట్టించిన ఉత్సహంతో ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెట్టినప్పటికీ దురదృష్టవశాత్తు టన్నెల్ కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం అనే మరో అద్భుత పథకం తీసుకువచ్చిందని.. ఈ పథకం నిరుద్యోగుకులకు ఎంతోగానో ఉపయోగపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.