
- రాష్ట్రపతి భవన్‌లో ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ ప్రారంభం
- హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి
న్యూఢిల్లీ, వెలుగు: అగ్గిపెట్టెలో పట్టే చీరను చూసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అబ్బురపడ్డారు. అది నేసిన సిరిసిల్ల నేతన్న వెల్ది హరిప్రసాద్‌ను ప్రశంసించారు. చిన్న చేనేత మగ్గంపై రాష్ట్రపతి చిత్రాన్ని కూడా హరిప్రసాద్ తయారు చేశారు. అది చూసి ఆయన ప్రతిభను ముర్ము మెచ్చుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల కళలు, చేనేత – హస్తకళలు, ఆహర పదార్థాలు, సంస్కృతిని చాటేలా ఎంజాయ్ ది బెస్ట్ ఆఫ్ సౌతిండియా పేరుతో రాష్ట్రపతి భవన్‌లో ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ నెల 9 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ప్రారంభించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లు, సంబంధిత మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పెవిలియన్‌కు విచ్చేసిన రాష్ట్రపతిని గవర్నర్, డిప్యూటీ సీఎం సాదరంగా ఆహ్వానించి.. తెలంగాణ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. అగ్గి పెట్టెలో పట్టే విధంగా చీరను నేసిన సిరిసిల్ల నేతన్నలను రాష్ట్రపతి ప్రశంసించారు.
చీరను నేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ స్టాల్స్‌ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. కాగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించిన గుస్సాడి నృత్యం ఆకట్టుకుంటున్నది.
దక్షిణాది ఫెస్టివల్..
దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను చాటే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది. ఈ పెవిలియన్‌లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్ సహా 20 మంది ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది హాస్తకళా నిపుణులు స్టాల్స్ ఏర్పాటు చేశారు.
ముగ్గురు హస్తకళా నిపుణులు స్వయంగా ఆయా వస్తువుల తయారీ పద్ధతిని అతిథులకు చూపించనున్నారు. మరోవైపు తెలంగాణ రుచులతో కూడిన ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అతిథులను అలంరించడానికి రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కళా రూపాలైన ఒగ్గు డోలు, పేరిణి, గుస్సాడీ ప్రదర్శనలు నిర్వహించనున్నారు.