కరీంనగర్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఒకవైపు ఉత్తమ పంచాయతీలకు పురస్కారాలు అందజేస్తుంటే.. మరోవైపు తమకు అవార్డులు వద్దు.. అప్పుల నుంచి బయటపడేస్తే చాలని సర్పంచ్ లు రోడ్డెక్కుతున్నారు. గ్రామ పంచాయతీ అకౌంట్లపై ఫ్రీజింగ్ ఎత్తేసి..పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. జిల్లాలోని గోపాల్ రావుపేట, వన్నారం, చిప్పకుర్తి, వెంకటాయపల్లి, మన్నంపల్లి, పందికుంటపల్లి, చెల్పూర్, రంగాపూర్ సర్పంచ్ లు పార్టీలకతీతంగా ఒక్కటై కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ లో సోమవారం వినతి పత్రాలు అందజేశారు. బిల్లులు రాక తాము పడుతున్న ఇబ్బందులను, అప్పుల బాధలను ఏకరువు పెట్టారు.
బాధిత సర్పంచుల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారితోపాటు అధికార బీఆర్ఎస్ కు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒకవైపు జిల్లా స్థాయి దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలను అందజేస్తుండగానే..కొందరు సర్పంచ్ లు పార్టీలకతీతంగా అకౌంట్ల ఫ్రీజింగ్ పై వినతిపత్రాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అడిషనల్ కలెక్టర్ ను కలిసినవారిలో గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న రెడ్డి, రామడుగు పందికుంటపల్లి సర్పంచ్ మొగుల్ల ఎల్లయ్య, చిప్పకుర్తి సర్పంచ్ జె.రాజేశ్వరి, రంగాపూర్ సర్పంచ్ బింగి కరుణాకర్, చెల్పూర్ మహేందర్ గౌడ్ ఉన్నారు.
పైసలున్నా తీస్కోలేకపోతున్నరు
అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులకు ప్రభుత్వం టార్గెట్లు పెట్టి వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, పైపు లైన్స్, బోరు మోటార్లు, గ్రావెల్ (స్టీల్), మొరం, పల్లె ప్రగతి పనులను చేయించింది. ప్రతి పాలకవర్గంతో నిర్బంధంగా ట్రాక్టర్లను కొనుగోలు చేయించింది. అధికారుల ఒత్తిళ్లతో పనులు చేసిన సర్పంచులు..సమయానికి బిల్లులు వస్తాయనే ఆశతో రూ.2 నుంచి రూ.5 వరకు మిత్తికి లక్షలాది రూపాయలను తీసుకువచ్చారు.
పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా బిల్లులు డ్రా కాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారు. ఒక్కో పంచాయతీలో తక్కువలో తక్కువ రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. స్టేట్ ఫైనాన్స్ ఫండ్స్,15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్లలో ఉన్నప్పటికీ ఫ్రీజింగ్ చేయడంతో చెక్కులు వేస్తే రిజెక్ట్ అవుతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు తీర్చడానికి భూమి అమ్ముకున్నా
రావుపేటలో సీసీ రోడ్లు, మంచినీటి పైపులైన్ల రిపేర్, బతుకమ్మ ఘాట్, స్ట్రీట్ లైట్ల కోసం స్తంభాలు, పల్లెప్రకృతి వనం గేట్ తదితర పనుల కోసం అప్పు తీసుకువచ్చి రూ.35 లక్షలు ఖర్చు పెట్టిన. స్టేట్ ఫైనాన్స్, జనరల్ ఫండ్ అకౌంట్లలో కలిపి రూ.35 లక్షలున్నా ఫ్రీజింగ్ వల్ల రావడం లేదు. భూమి అమ్మి తీసుకున్న అప్పుల నుంచి రూ.18 లక్షలు కట్టిన. మిగతా వాటికి నెలనెలా మిత్తి పెరుగుతున్నా కట్టలేని పరిస్థితి. మా బిల్లులు తొందరగా ఇయ్యాలె. - కర్ర సత్యప్రసన్న రెడ్డి, సర్పంచ్, గోపాల్ రావు పేట, రామడుగు