తెలంగాణలో 2014 సీన్ ​రిపీట్!..నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు

తెలంగాణలో 2014 సీన్ ​రిపీట్!..నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు
  • 2014లో బీఆర్​ఎస్​లో 12 మంది ఎమ్మెల్యేలతో టీడీపీఎల్పీ విలీనం
  • అదే ఏడాది ఐదుగురు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్​
  • 2019లో 12 మందిని చేర్చుకొని సీఎల్పీని కలిపేసుకున్న గులాబీ పార్టీ
  • నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు
  • అప్పుడు మీరు చేసిందేమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్, సీపీఐ నేతలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో చేరికల సీన్​ రిపీట్​అవుతోంది. 2014, 2018 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్​కు​ సరిపడా మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష  పార్టీలను చీల్చడం ద్వారా ఎమ్మెల్యేల చేరికలను ఆ పార్టీ చీఫ్​ కేసీఆర్ ​ప్రోత్సహించారు. ప్రతిపక్షాల ఉనికే లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారి టీడీపీ ఎల్పీని, రెండోసారి కాంగ్రెస్​ఎల్పీని బీఆర్ఎస్​లో విలీనం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రాగా, రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్​సహా బీఆర్ఎస్​ లీడర్లు సమర్థించుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, నేతల రాజకీయ భవిష్యత్తు​ కోసం వచ్చేవాళ్లను ఎలా కాదంటామని ఎదురు ప్రశ్నించారు. తీరా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్​ ప్రతిపక్షానికే పరిమితం కావడం.. లోక్​సభ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలుచుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరుతున్నారు. 

గతంలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని సమర్థించుకున్న బీఆర్ఎస్​ నేతలే.. ఇప్పుడు కాంగ్రెస్​తీరును తప్పుపడుతున్నారు. కాంగ్రెస్​చర్య రాజ్యాంగ విరుద్ధమని, న్యాయం కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తామని మాట్లాడుతున్నారు.

2014లో టీడీపీ ఎల్పీ విలీనం.. 

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్​)​ పార్టీ 63 స్థానాల్లో గెలిచి, అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ 21 సీట్లు, టీడీపీ 15 సీట్లు సాధించాయి. కానీ అసెంబ్లీలో బలం పెంచుకునేందుకు అప్పటి సీఎం కేసీఆర్​ రాజకీయ పునరేకీకరణ పేరిట రెండేండ్లలో రెండు పార్టీల నుంచి 19 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో చేర్చుకున్నారు. టీడీపీ నుంచి12 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో అధికారికంగా టీడీపీ ఎల్పీ  టీఆర్ఎస్​లో విలీనమైంది. కాంగ్రెస్​ నుంచి ఐదుగురిని, వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను సైతం టీఆర్ఎస్​లో చేర్చుకున్నారు. తమ ఆహ్వానం మేరకు పార్టీలో చేరినందుకు బహుమతిగా తలసాని శ్రీనివాస్​ యాదవ్ లాంటి వాళ్లకు  మంత్రి పదవులు ఇచ్చారు. ఉద్యమకారులను పక్కనపెట్టి మరీ వలస నేతలకు పదవులు ఇవ్వడంపై విమర్శలు వచ్చినా.. గులాబీ బాస్​ పట్టించుకోలేదు. 

2019లో సీఎల్పీ విలీనం..

తొలి ఎన్నికల్లో మార్జిన్​లో బయటపడ్డ టీఆర్ఎస్​ పార్టీ.. 2018లో జరిగిన ఎన్నికల్లో 88 సీట్లతో భారీ విజయం సాధించింది. కానీ సభలో తనను ప్రశ్నించే ప్రతిపక్షమే ఉండకూడదనే ఉద్దేశంతో అప్పటి సీఎం కేసీఆర్​, కాంగ్రెస్​ పార్టీని టార్గెట్​ చేశారు. ఆ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ నుంచి గెలిస్తే.. 12 మందిని లాగేసుకున్నారు. దశలవారీగా కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ 2019 జూన్​లో సీఎల్పీని టీఆర్ఎస్​లో  విలీనం చేసుకున్నారు.  కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్​లోకి వచ్చి చేరిన సబితా ఇంద్రా రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఫలితంగా కాంగ్రెస్  కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలకే పరిమితం అయ్యింది. అప్పట్లో ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ మారినవాళ్లపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. తాజాగా ఎన్నికలు ముగిసి, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటికీ నాటి కేసు మాత్రం ఎటూ తేలలేదు. 

ఇప్పుడు బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి..

పదేండ్లుగా రాష్ట్రంలో తమకు తిరుగులేదని భావించిన బీఆర్ఎస్​ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షపాత్రకే పరిమితమైంది. కాంగ్రెస్​ అలవిగాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెల్చిందని, బీఆర్ఎస్​ను ఓడించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని,  పార్లమెంట్​ఎన్నికల్లో 12 సీట్లు గెలుస్తామని స్వయంగా కేసీఆర్​, కేటీఆర్​ చెప్పినా.. లోక్​సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పార్లమెంట్​లో ప్రాతినిథ్యం కోల్పోయారు. కంటోన్మెంట్​అసెంబ్లీ స్థానాన్ని  సైతం చేజార్చుకోవడంతో ఆ పార్టీ హైకమాండ్​పై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో విశ్వాసం సన్నగిల్లింది.  ఈ క్రమంలో తమ రాజకీయ భవిష్యత్తు​ కోసం కాంగ్రెస్​లో చేరేందుకు క్యూ కడ్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్​, తెల్లం వెంకట్రావ్​, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్​రెడ్డి, సంజయ్​కుమార్​బీఆర్ఎస్​ను వీడి  కాంగ్రెస్​లో చేరారు. మరికొందరు కూడా అధికార పార్టీలో చేరేందుకు క్యూ కడ్తున్నారు.  మొదట్లో దానం నాగేందర్, కడియం​లాంటివాళ్ల చేరికలను మామూలుగా తీసుకున్న కేసీఆర్, కేటీఆర్​తాజాగా పోచారం, సంజయ్​చేరికలతో అలర్ట్​ అయ్యారు. 

ముఖ్యంగా కాంగ్రెస్​వి నీతిమాలిన రాజకీయాలని, ఆ పార్టీ చర్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ కేటీఆర్​ ట్వీట్​చేశారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని స్పష్టంచేశారు. దీనికి కాంగ్రెస్​ నేతలతో పాటు కూనంనేని సాంబశివరావు లాంటి సీపీఐ ఎమ్మెల్యే సైతం గట్టిగానే కౌంటర్​ ఇస్తున్నారు. చేరికలకు శ్రీకారం చుట్టిందే కేసీఆర్​ అని, టీడీపీ, కాంగ్రెస్​ను విలీనం చేసుకున్నప్పుడు రాజ్యాంగానికి విరుద్ధమని తెలియదా? అని నిలదీస్తున్నారు.  కేటీఆర్​ కామెంట్స్​ జనాల్లోనూ చర్చకు దారి తీశాయి. ‘మీరు చేస్తే ఒప్పు.. కాంగ్రెస్​ చేస్తే తప్పా? ’ అంటూ సోషల్​ మీడియాలో కేటీఆర్​ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో  కాంగ్రెస్​ తీరునూ కొందరు  తప్పు పడ్తున్నారు. అసెంబ్లీలో మెజార్టీ ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి చేరికలకు ఏం అవసరం వచ్చిందని నిలదీస్తున్నారు.  మొత్తం మీద కేసీఆర్​చేసిన పాపం, ఆయన మెడకే చుట్టుకుందని ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.