అయోమయంలో ప్రతిపక్షాలు..షెడ్యూల్ వచ్చినా ఖరారు కానీ క్యాండిడేట్స్

అయోమయంలో ప్రతిపక్షాలు..షెడ్యూల్ వచ్చినా ఖరారు కానీ క్యాండిడేట్స్
  • ప్రచారంలో దూసుకుపోతోన్న బీఆర్‌‌ఎస్​ నేతలు

మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. నర్సాపూర్ మినహా 10 చోట్ల అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు.  వారు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇంకా కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్స్ ను ఖరారు చేయలేదు. ఆయా పార్టీలు ఇంకా లిస్ట్ ఫైనల్ చేయక పోవడంతో ఆశావహులలో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి టికెట్ వస్తుందో అర్థం కాక  లీడర్లు కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ డైలమాలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు గాలం వేసి కారెక్కిస్తోంది.

మెదక్ జిల్లాలో..

జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్ సెగ్మెంట్​లో బీఆర్​ఎస్​ టికెట్​ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డికే దక్కగా, నర్సాపూర్​ టికెట్​ పై ఇంకా సస్సెన్స్​ కొనసాగుతూనే ఉంది. అయితే అధికారికంగా పేరు ప్రకటించకున్నా మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునీతారెడ్డికే  బీఆర్​ఎస్​ టికెట్​ దాదాపు ఖరారైంది. ఇక కాంగ్రెస్​లో మెదక్ టికెట్​ మల్కాజ్​ గిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్​కు ఖరారుకాగా, నర్సాపూర్​ టికెట్​ కోసం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​ కుమార్ పోటీ పడుతున్నారు. మరోవైపు సిట్టింగ్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాంగ్రెస్​ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీలో మెదక్, నర్సాపూర్​ రెండు సెగ్మెంట్​ల టికెట్లు ఇంకా ఖరారు కానేలేదు. 

సిద్దిపేట జిల్లా...

జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో నెల రోజుల క్రితమే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వచ్చే వారం రోజుల్లో సీఎం కేసీఆర్ రెండు సభలను నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సన్నద్దం చేస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ లు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించక పోవడంతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

కాంగ్రెస్ లో కొనసాగుతున్న సస్పెన్స్

సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సిద్దిపేట నుంచి టికెట్ కోసం అత్యధికంగా 15 మంది దరఖాస్తు చేసుకోగా అందరు తమదైన ప్రయత్నాల్లోనే ఉన్నారు. టికెట్ల వేటలో ఆశావహులు ఉండటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపే వారే కరువయ్యారు. సిద్దిపేట టికెట్ కోసం దర్పల్లి చంద్రం, పూజల హరికృష్ణ, తాడూరి శ్రీనివాస్ గౌడ్ లమధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఒకవేళ మహిళకు కేటాయించాలనుకుంటే భవాని రెడ్డికి అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది. దుబ్బాక నుంచి ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ప్రధానంగా చెరుకు శ్రీనివాసరెడ్డి, కత్తి కార్తీక గౌడ్, శ్రవణ్ కుమార్ రెడ్డిల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరంతా ఒకవైపు టికెట్ ప్రయత్నాలు చేస్తూనే అడపాదడపా గ్రామాల్లో ప్రచారాల్లో పాల్గొంటున్నారు.  గజ్వేల్ నుంచి ఎనిమిది మంది దరఖాస్తు చేసుకున్నా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి,  బి.శ్రీకాంతరావు, జశ్వంత్ రెడ్డిల మధ్య పోటీ ఉంది. గజ్వేల్ టికెట్  నర్సారెడ్డికి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో నియోజకవర్గంలో కొంత మేర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఆరుగురు దరఖాస్తు చేసుకున్నా ప్రధానంగా పొన్నం ప్రభాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. 

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ ఆశావాహులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి, జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్, అందోల్ నుంచి దామోదర్ రాజనర్సింహ పేర్లు ఫైనల్ అయినట్టు తెలుస్తున్నా.. పార్టీ హై కమాండ్ మాత్రం అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇకపోతే పటాన్ చెరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ హైకమాండ్​ ఫైనల్ చేయలేక పోతుంది. ఇక్కడ ముదిరాజ్ కులస్తుల ద్వారా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండేందుకు నీలం మధు ప్లాన్ చేస్తుండగా, కాంగ్రెస్ హై కమాండ్ మధుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే నారాయణఖేడ్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న సురేశ్​షెట్కార్, పట్లోళ్ల సంజీవరెడ్డి ఇద్దరూ పట్టుదలతో ఉండడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక బీజేపీలో సంగారెడ్డి టికెట్​ ఆశిస్తున్న రాజేశ్వర్ రావు దేశ్​ పాండే,  పులిమామిడి రాజుల పేర్లు వినపడుతుండగా దేశ్ పాండే వైపు అధిష్టానం మొగ్గు చూస్తున్నట్టు తెలుస్తోంది. 

ALSO READ: నిజామాబాద్ లో ఏసీబీకి చిక్కిన ఇందూర్​ ఆర్ఐ
 

పటాన్ చెరు టికెట్ ఆశిస్తున్న నందీశ్వర్ గౌడ్ కు పోటీ లేకపోవడంతో దాదాపు ఆయన పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆందోల్ నుంచి బాబుమోహన్, మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్యల పేర్లు వినిపిస్తున్నప్పటికీ బాబు మోహన్ కు ఖరారు చేసే అవకాశాన్నాయి. జహీరాబాద్ నుంచి దామోదర్ రామచందర్ తో పాటు ఇటీవల బీజేపీలో చేరిన ఢిల్లీ వసంత్ పేర్లు వినిపిస్తుండగా, పార్టీ హై కమాండ్ ఢిల్లీ వసంత్​ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. నారాయణఖేడ్ లో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డితో పాటు సంగప్ప పేర్లు వినపడుతున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఫైనల్ అయ్యాక ఇక్కడ బీజేపీ అభ్యర్థిత్వం ఖరారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.