
ఇస్లామాబాద్: ఇరాన్లో ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌లో ఐఎస్ఐకి సహకరించిన ముస్లిం మతపెద్ద ముఫ్తీ షా మీర్ హత్యకు గురయ్యాడు. బలూచిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపేశారు. శుక్రవారం రాత్రి టర్బత్‌లోని లోకల్ మసీదులో ముఫ్తీ షా మీర్ ప్రార్థనలు ముగించుకుని మోటార్ సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. అతన్ని వెంబడించిన కొందరు దుండగులు.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో పలుమార్లు కాల్పులు జరిపారు. వెంటనే స్థానికులు అతన్ని హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.
ముఫ్తీ షా మీర్.. మత సంస్థ అయిన జమియత్ ఉలేమా–ఇ–ఇస్లాం (జేయూఐ)లో సభ్యుడు. ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడనే ఆరోపణలున్నాయి. ఐఎస్ఐకు అత్యంత సన్నిహితుడు. పాక్‌లోని టెర్రరిస్ట్ క్యాంపులను పలుమార్లు సందర్శించాడు. ఇండియాలోకి టెర్రరిస్టులు చొరబడేందుకు సహకరించేవాడు. ముఫ్తీ షా మీర్ పని చేస్తున్న పార్టీకి సంబంధించిన ఇద్దరు పోయిన వారమే బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్లో హత్యకు గురయ్యారు.