- ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత రైతు రుణమాఫీ ప్రారంభం
- సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
- లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు
హనుమకొండ/ భూపాలపల్లి అర్బన్/ వరంగల్కలెక్టరేట్/ ములుగు/ జనగామ అర్బన్, వెలుగు: రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతులు సంబురాలు నిర్వహించారు. రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయగా, ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. రైతురుణ మాఫీ కార్యక్రమాన్ని హనుమకొండ కలెక్టరేట్ లో ఆఫీసర్లతో కలిసి కలెక్టర్ ప్రావీణ్య వీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని 14,700 మంది లబ్ధి చేకూరగా, వారికి సంబంధించిన రూ.143.82 కోట్లు మాఫీ అయ్యాయని తెలిపారు. కాగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల 300 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, వారికి కూడా త్వరలోనే పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఐదుగురు రైతులకు రుణ మాఫీ చెక్కుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్, వ్యయసాయ అధికారి రవీందర్ సింగ్, డీసీవో నాగేశ్వర రావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
జయశంకర్భూపాలపల్లి జిల్లాలో రెండో విడత రైతు రుణమాఫీ కింద 8754 మంది రైతులకు రూ.95,95,47,866 రుణమాఫీ జరిగినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఐడీవోసీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ విజయభాస్కర్, ఎల్డీఎం తిరుపతి, వివిధ బ్యాంకుల మేనేజర్లు, రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 16,502 మంది రైతులకు రూ.85,00,12,230 రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. కాగా, నూతన డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టిన కే.చిన్నయ్య కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదిలా ఉండగా, వరంగల్కలెక్టరేట్ఆవరణలో రుణమాఫీ సందర్భంగా టెస్కాబ్చైర్మన్మార్నేని రవీందర్రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంతకుముందు కలెక్టరేట్లో కలెక్టర్వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి పలువురి రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మొత్తం14,510 మంది రైతులకు గానూ రూ.142 కోట్ల 58 లక్షలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ములుగు కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్దివాకర పాల్గొని రైతులకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో రెండో విడతలో 6738 మంది రైతులకు రూ.67 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు పర్మర్ పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్తో కలిసి రెండో విడత రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో 17,419 మంది రైతులకు గాను రూ.180 కోట్లు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. అనంతరం రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు.