జాతీయ కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీపై పార్లమెంటు అనర్హత వేటు వేయడం, ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ. ‘మోడీ’ అని చివర పేరుగల నీరవ్ మోడీ, లలిత్ మోడీలు దేశ సంపద దోపిడికి కారణమవుతున్నారని.. చేసిన రాజకీయ విమర్శను క్రిమినల్ డిఫమేషన్గా మార్చి గుజరాత్లో మోడీ తన సామాజిక వర్గంతో సూరత్ కోర్టులో కేసు పెట్టించారు.సూరత్ కోర్టు పిటిషన్‌దారులను సమర్థిస్తూ రాహుల్‌గాంధీకి రెండేండ్ల జైలుశిక్ష విధించడం వల్ల, ప్రజాప్రాతినిధ్య చట్టంలో తెచ్చిన మార్పుల కింద రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురయ్యాడని పార్లమెంటు సెక్రటరీ జనరల్ గెజిట్‌ను జారీ చేశారు.
కాంగ్రెస్ పట్ల విధ్వేషం దేశానికే మంచిది కాదు
రాహుల్ చేసిన రాజకీయ విమర్శల్లో పార్లమెంటు సభ్యత్వం రద్దయ్యేంత తీవ్రత ఉందా? అని ప్రజాస్వామిక వాదులు ఆశ్చర్య పోతున్నారు.మహాత్మాగాంధీ కూడా బ్రిటిష్ కాలంలో దేశద్రోహం కేసు కింద రెండేండ్లు అక్రమ కేసులతో జైలు శిక్ష పడ్డప్పుడు, అహింసా పద్దతిలో పోరాడినట్టుగానే, ఇపుడు రాహుల్‌గాంధీ కూడా శాంతి పోరాటంతోనే గెలవాలని అందరూ భావిస్తున్నారు. భారతదేశంలోని ప్రజాస్వామిక వాదులు, రాజ్యాంగ వాదులందరూ బీజేపీ ప్రభుత్వ ప్రమాదకర ధోరణి చూసి విస్తుపోతున్నారు. నేరానికి శిక్ష అనేది అనర్హతగా మారడం రాజ్యాంగ వ్యతిరేకం. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ, సీఈసీ లాంటి రాజ్యాంగ వ్యవస్థలపై కోల్పోతున్న నమ్మకం.. ఇపుడు పార్లమెంటు అనర్హత వేటుల దాకా రావడం విచారకరం. సూరత్ కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూనే అప్పీల్‌కు 30 రోజుల సమయం ఉన్నా.. ఆ అవకాశాన్ని కూడా వినియోగించనివ్వకుండా వెనువెంటనే రాష్ట్రపతిని కూడా కనీసం సంప్రదించకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన నాయకుడిపై ఇలా అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటుతో ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడిని అదీ నాన్–క్రిమినల్ కేసులో టర్మినేట్ చేయడం అనేది రాజకీయ కక్షసాధింపు చర్యగానే చూడాల్సివస్తుంది. మోడీ ప్రభుత్వంపై వస్తున్న అనేక విమర్శలను పక్కదారి పట్టించడానికే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని స్పష్టమవుతుంది. గోద్రా సంఘటనపై డాక్యుమెంటరీ, తన మిత్రుడు అదానీపై హిండెన్‌బర్గ్ డాక్యుమెంటరీ వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన అపప్రదను ఈ రూపంలో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదీనూ రాజ్యాంగ వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్న తీరు గర్హనీయం. తమ సొంత పార్టీ ఎంపీ ఒక హత్యకేసులో నిందితుడైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బ్రిజ్‌భూషన్ శరణ్‌సింగ్‌పై చర్యలు లేవెందుకు?
గాంధేయ మార్గంలోనే పోరాడుతాం..
భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ జాతీయ, అంతర్జాతీయ రాజకీయ శ్రేణుల్లో విస్తృత ప్రాచుర్యం పొందాడు. ఆ తర్వాత పరిణతి చెందిన నాయకుడుగా అవరతరించడం కూడా బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అది జీర్ణించుకోలేకనే ఇలాంటి క్రూరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారనే భావన బలపడుతున్నది. ఇప్పటికైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మేధావులు ఆలోచించాలి. మోడీ, అమిత్‌షా ద్వయం వల్ల దేశంలో అడ్డదారి రాజకీయాలు పెరిగి ప్రజాస్వామ్య రాజకీయాలు కనుమరుగైనాయి. కాంగ్రెస్‌ను ఓడించడానికి మీరు ఎంచుకున్న వీళ్ల ద్వారా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నదని గ్రహించండి. సోనియాగాంధీని బార్ డ్యాన్సర్ అన్నా, గాడ్సేకు గుడి కట్టాలన్నా, నెహ్రూని కల్తీ ఇండియన్ అని ట్రోల్ చేసినా, ఇందిరా గాంధీని జైల్లో పెట్టినా, ఆమెను అవమానించినా.. కాంగ్రెస్ ఏనాడైనా గాంధేయ మార్గంలోనే పోరాడుతూ వస్తున్నది. ఇపుడు రాహుల్ గాంధీని జైల్లో పెట్టినా.. బీజేపీ అప్రజాస్వామిక రాజకీయలపై కాంగ్రెస్‌పార్టీ ఎదురొడ్డి పోరాడుతుంది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఎవరు విధ్వేషం చిమ్మినా కాంగ్రెస్ప్రేమనే పంచుతుంది. శాంతి యుద్ధంతోనే ప్రజల మనసులను గెలుస్తుంది. మా నాయకుడు రాహుల్‌గాంధీ ‘డరోమత్’ అనే భరోసా నినాదంతో మమ్మల్ని ముందుకు నడిపస్తాడనే నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీపై ఉన్న విధ్వేష ఆలోచనను మాని, మానవీయ రాజకీయాల గురించి ఆలోచించండి. అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ అయిన భారత దేశ రాజకీయాలపై ప్రపంచ విశ్వసనీయతను నిలబెట్టడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని ఎవరూ మర్చిపోవద్దు.
- డా. అద్దంకి దయాకర్, ప్రధాన కార్యదర్శి, టీపీసీ