సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ రైలు ఆరు గంటలు ఆలస్యమైంది. టైం టూ టైం.. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వందే భారత్ రైలు.. ఇన్ని గంటలు ఆలస్యం కావటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2023, నవంబర్ 7వ తేదీ ఉదయం 6 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి తిరుపతి బయలుదేరాల్సిన వందే భారత్ రైలు.. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు రీ షెడ్యూల్ చేశారు. దీంతో ఆరు గంటలపాటు ప్లాట్ ఫాంపై తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు.
రైలు ఆలస్యంగా రావడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి గమ్యం చేరాలనుకున్న వారు రైలు ఆలస్యంతో విసిగిపోయారు. కొంతమంది రైల్వే అధికారులను విచారించారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్-(20701 ) రైలు స్ప్రింగ్ రేకులో సాంకేతిక లోపం కారణంగానే ఆలస్యం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు. ఆలస్యమైనా రాత్రి 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని చెప్పారు.