- మన పిల్లల్ని ఇలాంటి బడుల్లో చదివిస్తమా?
- పరిగి గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్‌పై రంగారెడ్డి జిల్లా సివిల్ జడ్జి శ్రీదేవి ఫైర్
పరిగి, వెలుగు: పరిగి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో వసతులు.. ఖైదీలకు ఇచ్చే వసతుల కన్నా అధ్వానంగా ఉన్నాయని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సివిల్ సీనియర్ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఎ.శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించి పాఠశాలను శుక్రవారం సందర్శించానని ఆమె తెలిపారు. సాంఘిక సంక్షేమ జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ శారద, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ తో బడిలో నెలకొన్న సమస్యలపై ఆమె మాట్లాడారు. స్టూడెంట్లకు పెట్టిన భోజనంలో కప్ప ఎలా వచ్చిందని ప్రశ్నించారు. గురువారం రోజు భోజనం వండిన సిబ్బంది ప్రస్తుతం ఉన్నారా? అని అడిగారు. ఆరోజు వంట వండిన సిబ్బందిని తొలగించామని, కొత్త స్టాఫ్‌ను ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ వేణుగోపాల్ సమాధానం చెప్పారు. ‘‘బియ్యం సరిగ్గా వస్తున్నాయా? ప్రతి నెలా కోటా అలాట్మెంట్ జరుగుతున్నదా? అవకతవకలు ఏమన్నా ఉన్నాయా?” అని వేణుగోపాల్ ను జడ్జి ప్రశ్నించారు. అనంతరం తరగతి గదులు, డార్మెటరీ రూంలు, కిచెన్, వంట సామగ్రి, స్కూల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వసతుల గురించి స్టూడెంట్లను ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్తీక్ అనే విద్యార్థికి పెట్టిన ఆహారంలో కప్ప వచ్చిందని విద్యార్థులు శ్రీదేవికి తెలిపారు. కిటికీలు, డోర్లు సరిగ్గా లేవని చెప్పారు. ‘‘గురువారం ఒక్కరోజే కప్ప వచ్చిందా? రోజూ భోజనం ఎలా ఉంటుంది?” అని ఆమె అడిగారు. రోజూ ఉదయం, సాయంత్రం అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెప్పారు. ‘‘ఇలాంటి వసతులున్న బడిలో మన పిల్లల్ని చదివిస్తామా? నిరుపేద విద్యార్థులను చదువుకోవడానికి ఇక్కడకు పంపితే మీరు ఇలాంటి భోజనం పెడతారా? నాసిరకం భోజనంతో వారు ఎట్లా చదువుకుంటారు” అని ప్రిన్సిపాల్ పై ఆమె మండిపడ్డారు. ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, ఎలాంటి లోపం జరిగినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, అన్నం వండేందుకు స్టీమర్ అవసరం ఉందని పాఠశాల చైర్మన్ జడ్జి దృష్టికి తీసుకెళ్లగా, నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు.
సీఎం సమావేశం పెట్టాలె: ఎమ్మెల్యే సీతక్క
సీఎం కేసీఆర్అత్యవసరంగా కేబినెట్‌సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గురుకుల పాఠశాల నుంచి నివేదిక తెప్పించుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. శుక్రవారం పరిగి గురుకుల హాస్టల్‌ను సందర్శించి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. విద్యారణ్యపురి గురుకుల పాఠశాలలో పరిసరాలు చూస్తేనే వాంతులయ్యేలా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం మనుమడు కప్పల భోజనం తింటుండా?: పరమేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ మనవడు కప్పల భోజనం తింటుండా అని బీజేపీ నేత మిట్ట పరమేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం పరిగి గురుకుల హాస్టల్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. హాస్టల్ తరగతి గదుల్లో కిటికీలు, తలుపులు, విద్యుత్ వైర్లు సరిగ్గా లేవని తెలిపారు. సీఎం ఇప్పటికైనా స్పందించి అన్ని గురుకులాల్లో సరైన వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.