ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లకు అవమానాలు తప్పడం లేదు. మాజీలుగా మిగిలిన ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తున్నా, వాటిని ఎవరూ ఖండించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆదివారం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. ‘బీఆర్ఎస్లో ఉంటే ప్రోటోకాల్ తో పాటు గౌరవం ఉంటుంది. పార్టీ నుంచి వేరు పడాలని చూస్తే ఊరుకోను. ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ మన అందరి చేతుల్లో ఉంది. పరిణామాలు మారితే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లోకి తీసుకోవాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇతర పార్టీలోకి వెళ్లి ఇబ్బందులకు గురి కావద్దని పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాన్ని ఉద్దేశించినవేనని అర్థమవుతోంది. ఉమ్మడి కుటుంబంలా ఉన్న పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఇప్పటి వరకు సాఫ్ట్ వేర్లా ఉన్న తాను హార్డ్ వేర్లా మారాల్సి వస్తుందంటూ రాములునాయక్ వ్యాఖ్యానించడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
న్యూ ఇయర్ నుంచి షురూ..
కొత్త సంవత్సరం ప్రారంభం రోజు నుంచి ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల్లో చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. రీసెంట్ గా అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ‘సీఎం కేసీఆర్ కు మీ ఎమ్మెల్యే చాలా సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డి గెలుపును ఎవ్వరూ ఆపలేరు’ అంటూ రామన్నపేట పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు. దీనిపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం భగ్గుమంటోంది.
అసలు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏ హోదాలో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఉపేందర్ రెడ్డికే వస్తుందన్నట్టు మాట్లాడారో చెప్పాలంటూ మండిపడుతున్నారు. దీనిపై పార్టీ కేడర్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తుమ్మల తప్పకుండా పాలేరు బరిలో ఉంటారని ఒకవైపు చెప్పుకుంటూ వస్తున్న సమయంలో, బీఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ ఇస్తున్నట్టుగా వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సోషల్ మీడియా గ్రూపుల్లో దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తున్న సమయంలోనే తాజాగా రాములు నాయక్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పొంగులేటి సెక్యూరిటీ తగ్గించి..
న్యూ ఇయర్ వేడుకల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ‘వచ్చే ఎన్నికల్లో శీనన్న టీమ్ పోటీకి రెడీ’ అంటూ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే బీఆర్ఎస్ హైకమాండ్ ఇన్ డైరెక్ట్ గా స్పందించింది. పార్టీ మారేందుకు పొంగులేటి సిద్ధమయ్యారన్న అంచనాతో ఆయన సెక్యూరిటీని తగ్గించింది. అలాగే జిల్లాలోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. పార్టీ నుంచి కేడర్, ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ‘బీఆర్ఎస్లో ఎవరూ నాయకులు లేరు, కేవలం కేసీఆర్ ఒక్కడే ఈ పార్టీకి నాయకుడు. బహిరంగ సమావేశాలు, ఊరేగింపుల్లో ఎవరికి పడితే వారికి నాయకత్వం అంటకట్టి ఒకే నాయకుడికి జై కొట్టొద్దు, పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు.
ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా వారికి సరైన గుర్తింపును తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ కి కృతజ్ఞత కలిగి ఉండాలి. 2018లో మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమి చవిచూచింది. దీనికి కారణం అంతర్గత కుమ్ములాటలు, వర్గ పోరు మాత్రమే. ఇక ముందు ఇటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారైనా సరే పార్టీపరమైన చర్యలు తప్పవు’ అంటూ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కూడా రీసెంట్ గా పొంగులేటిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి, తుమ్మలకు వ్యతిరేకంగా పార్టీ లీడర్లు చేస్తున్న ఈ కామెంట్లు వారి వ్యక్తిగతంగా చేస్తున్నయా, లేక పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనలతోనే ఈ విధంగా స్పందిస్తున్నారా అనే దానిపై చర్చ జరుగుతోంది.