- ఇన్ని రోజులు ఫోరెన్సిక్ రిపోర్టు అంటూ సాగదీత
- ఇప్పుడది వచ్చినా బయటపెట్టని పోలీసులు
- అందులోనూ ఏమీ తేలని వైనం
- మళ్లీ ఇప్పుడు హిస్టోపాథాలజీ రిపోర్టు రావాలంటున్న పోలీసులు
- కేసు విచారణ తీరుపై గిరిజన, ప్రజా సంఘాల ఆగ్రహం
వరంగల్, వెలుగు : సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి కేసు ఇంకా తేలలేదు. ఆమె చనిపోయి నెలన్నరైనా.. ఆమెది ఆత్మహత్యనా? హత్యనా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది వరంగల్ పోలీసులు ఇంకా తేల్చలేదు. తన సీనియర్ సైఫ్ వేధింపులతోనే ప్రీతి చనిపోయిందని తేల్చిన పోలీసులు.. సైఫ్ ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు పంపారు. కానీ ఆమె ఎలా చనిపోయిందన్నది మాత్రం ఇప్పటికీ తేల్చలేకపోయారు.
ఈ కేసు విషయంలో పోలీసులు మొదటి నుంచీ పూటకో మాట్లాడుతుండడంతో విచారణ తీరుపై విమర్శలు వస్తున్నాయి. రిపోర్టుల పేరుతో పోలీసులు కేసును సాగదీస్తున్నారని గిరిజన, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఫిబ్రవరి 22న ఎంజీఎంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అక్కడ ఆమె ట్రీట్ మెంట్ పొందుతూ 26న చనిపోయింది. తన కూతురిని సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధించాడని ప్రీతి తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి.
అనారోగ్యం, సూసైడ్ అటెంప్ట్ అని..
ప్రీతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఫిబ్రవరి 22న కేఎంసీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి నిమ్స్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న టైమ్ లో రెండ్రోజుల పాటు కేఎంసీ, ఎంజీఎంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కమిషనర్ రంగనాథ్ ఫిబ్రవరి 24న చెప్పారు. ప్రీతి హానికారక ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. ఆమె సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ తీసుకుందని, దీనికోసం గూగుల్ లో వెతికిందని చెప్పారు. దీనికి సైఫ్ వేధింపులే కారణమని, అతణ్ని అరెస్టు చేశామని తెలిపారు. టాక్సీకాలజీ రిపోర్టు కోసం బ్లడ్ శాంపిల్స్ తీశామని, అది వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఇది జరిగిన రెండ్రోజులకు ఫిబ్రవరి 26న ప్రీతి చనిపోయింది.
టాక్సీకాలజీ రిపోర్టులో ఏమీ తేలలే..
ప్రీతిది సూసైడ్ అని పోలీసులు చెప్పగా, టాక్సీకాలజీ రిపోర్టులో మాత్రం అదేమీ తేలలేదు. మార్చి 5న వచ్చిన టాక్సీకాలజీ రిపోర్టులో ప్రీతి రక్తం, అవయావాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని తేలింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు మరోసారి ఎంజీఎం బాట పట్టారు. సీపీ రంగనాథ్ స్వయంగా వెళ్లి అక్కడి డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందితో మాట్లాడారు. ప్రీతి కేసులో టాక్సీకాలజీ రిపోర్టు మాత్రమే ఫైనల్ కాదని, కొన్నిసార్లు మత్తు పదార్థాలను గుర్తించడం కష్టమవుతుందన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే క్లారిటీ వస్తుందని చెప్పారు. దానికి నెల టైమ్ పడుతుందని ఇష్యూను సద్దుమణిగేలా చేశారు. ఈ క్రమంలో మార్చి 20న మీడియాతో మాట్లాడిన సీపీ.. ప్రీతి కేసులో హత్య కోణం లేదని చెప్పారు. సూసైడ్‍తో పాటు కార్డియాక్ అరెస్టుగా కూడా భావిస్తున్నట్లు కొత్త విషయం తెలిపారు. ప్రీతి దగ్గర లభించిన ఇంజక్షన్లు మామూలువే అని మాట మార్చారు. సైఫ్ ర్యాగింగ్ ఒత్తిడితోనే ఆమె చనిపోయిందని అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మరోవైపు ఆ రిపోర్టులను ప్రామాణికంగా తీసుకుంటాం తప్పితే, వాటి ఆధారంగానే తమ విచారణ ఉండదన్నారు.
ఇంకో రిపోర్టు రావాల్సి ఉంది..
ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. కానీ అది ఇన్ కంప్లీట్‍గా ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)తో పాటు హిస్టోపాథాలజీ రిపోర్టు ఫైనల్ ఒపీనియన్ పెండింగ్‍లో ఉన్నట్లు వచ్చింది. మేమైతే ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం.
- ఏవీ రంగనాథ్, వరంగల్ సీపీ
కేసును నీరుగార్చే కుట్ర...
ప్రీతి కేసులో మెడికల్, పోస్టుమార్టం రిపోర్టులేవీ బయటకు వెల్లడించడం లేదు. కావాలనే కేసు విచారణ ఆలస్యం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఎంజీఎంలో ప్రీతికి తీసిన బ్లడ్ శాంపిల్ వదిలేసి, డయాలసిస్ తర్వాత తీసిన బ్లడ్ తో టెస్టులు చేస్తున్నారు. అందుకే రిపోర్టుల్లో అసలు నిజాలు బయటపడడం లేదు. రిపోర్టుల పేరుతో కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోంది.
- జాటోతు కిషన్ నాయక్, ఎల్‍హెచ్‍పీఎస్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్