పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మంచిర్యాల,వెలుగు: ఉమ్మడి  జిల్లాలో 2022 సంవత్సరంలోనూ నేరాల పరంపర కొనసాగింది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, రేప్​లు, కిడ్నాప్​లు, మోసాలు ఉమ్మడి జిల్లా వాసులను కలవరపర్చాయి. నిత్యం ఏదో ఓ చోట యాక్సిడెంట్లతో రహదారులు నెత్తురోడాయి. వందల ప్రాణాలు గాలిలో కలవగా, అంతకు రెట్టింపు సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో 4,176, ఆదిలాబాద్​లో 3,231, నిర్మల్​ జిల్లాలో 3,089 కేసులు నమోదయ్యాయి. పోలీసులు కొత్త టెక్నాలజీ వాడుతూ నేరాలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. కిందటి ఏడాదితో పోల్చితే నేరాల సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.   

కత్తులు దూసి... పెట్రోల్​ పోసి... 

కలహాలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలతో కత్తులు దూసుకున్నారు. ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో 26, ఆదిలాబాద్​లో 10, నిర్మల్​లో 15, ఆసిఫాబాద్​లో 18 మర్డర్లు జరిగాయి. ఇటీవల మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో ఆరుగురి సజీవ దహనం ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితులు అర్ధరాత్రి వేళ గ్రామంలోని ఓ ఇంటిపై పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో ఆరుగురు మంటల్లో మాడిపోవడం మానవత్వమున్న ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. అక్రమ సంబంధం, ఆస్తి కోసమే ఈ దారుణ హత్యలు జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక పైన చెప్పుకున్న కారణాలకు తోడు క్షణికావేశానికి లోనై వందల మంది తమ నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ ఏడాది ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 408 మంది ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

మహిళలపై నేరాలు...  

మహిళలు, చిన్నారులపై నేరాలు ఏమాత్రం తగ్గలేదు. భార్యాభర్తల గొడవలు, అత్తింటివారి వేధింపులు అబలలకు దినదినగండంగా మారాయి. లైంగిక దాడులు, ఈవ్​ టీజింగులు, ప్రేమ పేరిట వంచించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో 28, నిర్మల్​ జిల్లాలో 16 రేప్​లు జరిగాయి. చిన్నారులపై వేధింపులకు సంబంధించి పోక్సో యాక్ట్​ కింద మంచిర్యాలో 86 కేసులు, ఆదిలాబాద్​ జిల్లాలో 35, ఆసిఫాబాద్​లో 17 కేసులు నమోదయ్యాయి. మహిళపై మంచిర్యాలలో 513, ఆదిలాబాద్​లో 278, నిర్మల్​ జిల్లాలో 133, ఆసిఫాబాద్​లో 149 కేసులు రికార్డయ్యాయి. ఇక మంచిర్యాలలో 335, ఆదిలాబాద్​లో 227 మిస్సింగ్​ కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్​లు మంచిర్యాలలో 33, నిర్మల్​లో 34, ఆసిఫాబాద్​లో 37 జరిగాయి. చీటింగ్​ కేసులు మంచిర్యాలలో 173, ఆదిలాబాద్​లో 100 కేసులు నమోదయ్యాయి.  

పెరిగిన సైబర్​ క్రైం... 

ఈ ఏడాది సైబర్​ నేరాలు పెరిగాయి. నిందితులు ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తూ అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. పోలీసులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా యువత చాలామంది లోన్​ యాప్స్ నిర్వాహకుల ధనదాహానికి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేరగాళ్లు అడగకుండానే ఇన్​స్టంట్​ లోన్లు ఇచ్చి దానికి పది రెట్లు వసూలు చేస్తున్నారు. ఫొటోలను న్యూడ్​గా మార్ఫింగ్​ చేసి ఫోన్​లోని కాంటాక్ట్​ నంబర్లకు పంపుతామని వేధిస్తున్నారు. వీరి అకృత్యాలను మంచిర్యాల జిల్లాలోనే ఇద్దరు బలయ్యారు.

ఆన్​లైన్​ జాబ్స్​, ఆన్​లైన్​ గేమ్స్​, లక్కీ లాటరీల పేరిట లింకులు పంపి డబ్బులు దోచుకోవడమే కాకుండా బ్యాంకు అకౌంట్లను సైతం ఖాళీ చేస్తున్నారు. గుర్తుతెలియని యువతులు యువకులను ప్రేమ పేరిట వలలోకి దించి న్యూడ్​ వీడియో కాల్స్​ రికార్డు చేసి బ్యాక్​ మెయిలింగుకు పాల్పడి లక్షల రూపాయలు గుంజిన సంఘటనలు అనేకం. ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో ఏకంగా 109 సైబర్​ క్రైం కేసుల్లో రూ. కోటి రూపాయలు దోచుకున్నారు. నిర్మల్​ జిల్లాలో 32, ఆసిఫాబాద్​ జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి.  

గంజాయి.. మద్యానికి  బానిసలు... 

యువత గంజాయి, మద్యం మత్తుకు బానిసలవుతున్న తీరు కలవరపెడుతోంది. యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు, రేప్​లు, కిడ్నాప్​లు, దొంగతనాలతో పాటు చాలా నేరాలకు పురికొల్పుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది 7 గంజాయి 
కేసుల్లో 18 మందిని, ఆదిలాబాద్​లో 18 కేసుల్లో 28 మందిని, నిర్మల్​జిల్లాలో ఐదు కేసుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా, ఆసిఫాబాద్​ జిల్లాలో 21 గంజాయి కేసులు నమోదయ్యాయి. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు మంచిర్యాల జిల్లాలో నిరుడు 1,621 నమోదు కాగా, ఈ ఏడాది ఏకంగా 9,300 కేసులు రావడం గమనార్హం. ఆదిలాబాద్​లో 2021లో 904 కేసులు కాగా, ఈ సంవత్సరం వాటి సంఖ్య 5,443కు పెరిగింది. నిర్మల్​ జిల్లాలో గత ఏడాది 3,750 కేసులు ఉండగా, 2022లో 8,369 కేసులు 
నమోదయ్యాయి.  

నెత్తుటి దారులు...  

ఈ ఏడాది మంచిర్యాల జిల్లాలో 391 ప్రమాదాల్లో 146 మంది చనిపోగా, 245 మంది గాయపడ్డారు. ఆదిలాబాద్​ జిల్లాలో 2021లో 245 యాక్సిడెంట్లు జరిగాయి. 137 మంది మరణించగా, 304 మంది గాయపడ్డారు. 2022లో 265 యాక్సిడెంట్లలో 140 ప్రాణాలు గాలిలో కలిశాయి. 201 మంది క్షతగాత్రులయ్యారు. నిర్మల్​ జిల్లాలో 2021లో 277 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 140 మంది విగతజీవులు కాగా, 337 మందికి గాయాలయ్యాయి. 2022లో 259 యాక్సిడెంట్లలో 130 మంది మరణించగా, 284 మంది గాయపడ్డారు. జిల్లాలోని జాతీయ రహదారులపై ఘోర ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఎన్​హెచ్​ 44పై ఆదిలాబాద్​ జిల్లా తాంసి మండలంలో రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందారు. గుడిహత్నూర్​ దగ్గర కారును లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. ఆసిఫాబాద్​జిల్లాలో నిరుడు 160 ప్రమాదాలు జరిగాయి.