రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హైదరాబాద్, వెలుగు: యువత వ్యక్తిత్వ వికాసానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ప్రశంసించారు. మంగళవారం రామకృష్ణ మఠంలో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా గవర్నర్​పాల్గొని మాట్లాడారు. 

నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని చెప్పారు. 1893 సెప్టెంబర్ 11న చికాగో వేదికగా స్వామి వివేకానంద హిందూ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పారని గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు సూచించారు. రామకృష్ణ మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వీఐహెచ్ఈ ఫాకల్టీ సభ్యులు, వలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.