ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ కలెక్టరేట్‌‌‌‌ ముట్టడి ఉద్రిక్తం

నల్గొండ అర్బన్​, వెలుగు : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, టీచర్ల డిప్యుటేషన్ రద్దు చేయాలని సోమవారం ఎస్ఎఫ్ఐ చేపట్టిన నల్గొండ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన స్టూడెంట్లు కలెక్టరేట్‌‌‌‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. 

స్టూడెంట్లకు కాస్మొటిక్ చార్జీలు, పెండింగ్ స్కాలర్ షిప్ లను రిలీజ్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  సమస్యలు పరిష్కరించడంతో పాటు, ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేశ్, ఖమ్మంపాటి శంకర్, రేణుక, సైదానాయక్, లక్ష్మణ్, రవీందర్, జగన్, జగదీశ్, వీరన్న, సమ్మద్, సంపత్, రవి పాల్గొన్నారు.