ఆడబిడ్డల రక్షణపై నేతలకు పట్టింపేది?

ఆడబిడ్డల రక్షణపై నేతలకు పట్టింపేది?

దేశంలోని ఆడబిడ్డల రక్షణ మీద రాజకీయ నాయకుల చిత్తశుద్ధి పచ్చి అబద్ధం.  దేశంలో ఎన్నడూ లేని విధంగా గత పది ఏండ్ల నుంచి  దేశంలో ఆడబిడ్డల మీద జరుగుతున్న దాష్టీకాలకు అంతేలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్​కతాలో  జరిగిన మహిళా జూనియర్​ డాక్టర్ మీద హత్యాచారం సంఘటన నిగ్గు తేలకుండానే, దేశంలోని వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనలు ఆందోళన  కలిగిస్తున్నాయి. 'భారత్ తో ఆజాద్ హై మగర్ హమ్ కబ్ ఆజాద్ కెహలాయంగే' అంటూ వారు   ప్రశ్నిస్తున్నారు. కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులే కాటేస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి. 

దేశంలో  దేవిగా, ఇంటికి ఇలవేల్పుగా పూజించుకునే ఆడబిడ్డలకు రక్షణ కరువు అవుతోంది. పాలకులు బాధితులకు అండగా నిలబడకుండా నిందితుల వైపు నిలబడితే వారు ఎలా శిక్షించబడతారు! ఇక  వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి. ఆడబిడ్డలు ఇప్పుడు దేశంలో తాము స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం పోరాడే పరిస్థితి వచ్చింది.  అంటే పరిస్థితి ఎంత సీరియస్​గా ఉందో అర్థం  చేసుకోవాలి.  మహిళలపై అత్యాచారాలు, హత్యలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.  మరోవైపు వాటిని ఖండిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.  అయినా రాజకీయ నేతలకు కనువిప్పు కలగడం లేదు.  

నామమాత్రంగా పీఎం మోదీ స్పందన

మన పీఎం నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని  జలగావ్​లో  జరిగిన లక్​పతి దీదీ  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో  దేశంలో మహిళలపై అత్యాచారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.  ఎంతటి వారైనా వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే అని రాష్ట్రాలను కూడా కోరుతున్నట్లు పేర్కొన్నారు.  తాను లాల్ ఖిలా నుంచి కూడా మహిళల రక్షణ విషయంలో మాట్లాడినట్లు తెలిపారు. 

ఇది- మహిళల మీద ప్రేమ ఒలకబోత అనుకోవాలి.  దేశంలో మహిళలు అత్యాచారాలకు గురి అయినపుడు,  ప్రపంచ ఛాంపియన్స్​ అయిన కుస్తీ బిడ్డలు.. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తమని లైంగికంగా వేధిస్తున్నాడని, ఆందోళన చేసినపుడు, మణిపూర్​లో  ఇద్దరు ఆడబిడ్డలను  దుండగులు నగ్నంగా ఊరేగించి వారి మీద అత్యాచారం జరిపినపుడు స్పందించరు. చివరికి బీజేపీ ఎన్నికల ప్రచారంలో తిరిగిన, ఆ పార్టీ ఐటి సెల్ సభ్యులు ముగ్గురు వారణాసిలో యూనివర్సిటీలో జొరబడి ఒక యువతి మీద అత్యాచారం చేయడం,  వీడియోలు తీయడం జరిగినా పీఎం మోదీ మాట్లాడలేదు. 

హత్రస్​లో  దళిత యువతిపై  హత్యాచారం సంఘటన,  కుటుంబానికి శవం చూపకుండానే  దహనం చేసినపుడు, బాలిక మీద అత్యాచారం జరిపిన అతనికి మద్దతుగా ఇద్దరు బీజేపీ మంత్రులు ర్యాలీలో పాల్గొన్నపుడు నోరెత్తలేదు. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్​లో ఒక బాలికపై బస్సులో గ్యాంగ్ రేప్ జరిగింది. అయినా మాట్లాడరు. ఎందుకు?  అంటే..మహారాష్ట్ర లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.

మహిళలపై దాష్టీకాలు

మహిళల రక్షణపై చిత్తశుద్ధిలేని వారి మాటలను ఎవరు విశ్వసిస్తారు.  ఎమ్మెల్యేలు, ఎంపీలు  సైతం మహిళల మీద దాష్టీకాలకు పాల్పడుతున్నారు. మహిళలను అవమానిస్తున్నారు. పార్లమెంట్​లో కూడా మహిళలను అవమానిస్తారు. మహిళల పైన రేప్, మర్డర్, ఇతర  క్రైమ్ లలో అంటే విమెన్ ఎగనెస్ట్ క్రైమ్ లో నేతలు కూడా ఉన్నారు. ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ తదితర రిపోర్టులను ఒక్కసారి పరిశీలించినపుడు మొత్తం వివిధ పార్టీలకు చెందిన 191 మంది ఎమ్మెల్యే లు, ఎంపీలపై  మహిళల మీద క్రైమ్స్ కేసుల్లో ఉన్నారు. 

ఇందులో బీజేపీకి చెందినవారు 94 మంది ఉంటే, కాంగ్రెస్ రెండోస్థానంలో 23 మంది, టీడీపీకి చెందినవారు 17 మంది,  ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు 13 మంది,  తృణముల్ కాంగ్రెస్ నేతలు 10 మంది ఉన్నారు. మహిళా సీఎం ఉన్న రాష్ట్రంలో  జూనియర్​ డాక్టర్​ దారుణ హత్యాచారానికి గురవడం ఆందోళనకరమైన విషయం.  మొత్తం దేశంలో 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళల మీద  సీరియస్ క్రైమ్​ కేసుల్లో ఉన్నారు. ఒక బెంగాల్ లోనే 25 మంది ఎంపీ, ఎమ్మెల్యేలు కేసులలో ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్​లో 21 మంది, ఒడిశాలో 17 మంది  ఎమ్మెల్యే,  ఎంపీలు కేసులలో ఉన్నారు.  నిజానికి మహిళలపై నేరాలకు పాల్పడుతున్న కేసులలో ఉన్నవారు అంతా బడాబాబులే అంటే అతిశయోక్తి కాదు.

క్రిమినల్స్​కు పార్టీ టికెట్లు?

రాజకీయాలను మార్చేస్తాం అని పార్టీ పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా 13 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు ఉండడం ఆందోళనను కలిగిస్తున్నది.  జ్యుడీషియల్ డిలే అడ్వాంటేజ్, బాధితుల వేధింపుల కారణంగా నిందితులు తప్పించుకునే పరిస్థితి వచ్చింది.--- -2020 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇలా కేసులలో ఉన్నవారికి రాజకీయ పార్టీలు టికెట్లు ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నించినా... విస్మరించి  టికెట్లను  క్రిమినల్స్​కు ఇస్తున్నారు. హిపోక్రసీకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు కొందరు దాటుతున్నారు. 

పీఎం మహారాష్ట్రలో మహిళల రక్షణ పట్ల మాట్లాడిన మాటలు దేశం నమ్మడానికి సిద్ధంగా లేదు. ప్రజా ప్రతినిధులు మహిళలపైన దాష్టీకాలలో అగ్రభాగంలో ఉండడం సిగ్గుచేటు, బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఇతర ఏ పార్టీ అయినా ఇలాంటివారికి ముందు పార్టీ టిక్కెట్ ఇవ్వడం మానాలి.  మాజీ ఎంపీ బ్రిజ్​భూషణ్ విషయంలో బీజేపీ అతనికి కాకుండా అతని కొడుక్కు టికెట్ ఇచ్చింది. ఈ పద్ధతి కూడా ఏమాత్రం మంచిది  కాదు. అసలు ఆ కుటుంబంలో ఎవరికి కూడా టికెట్లు ఇవ్వొద్దు. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. క్రిమినల్స్​కు టిక్కెట్లు ఇవ్వడం బంద్ చేసిననాడే నేరస్థులు తప్పించుకునే అవకాశం ఉండదు. మహిళల రక్షణ మీద మొసలి కన్నీళ్లు కార్చడం కాదు.  ఆచరణ ఉండాలి.  

- ఎండి మునీర్, 
సీనియర్ జర్నలిస్ట్