‘సెస్​’ ఎన్నికల్లోనూ ప్రలోభాలు! : జూకంటి జగన్నాథం

సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల(సెస్) ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఎందుకంటే ఈ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధి వ్యాప్తంగా విస్తరించి పనిచేస్తున్నది. దీని చైర్మన్ పదవి అత్యంత ప్రభావ శీలమైనది. అంతేగాక సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మాత్రమే గాక, కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఈ సంఘం పనిచేస్తూ ఉన్నది. అందువల్ల అటు కేటీఆర్, ఇటు బండి సంజయ్ కుమార్ లకు సంస్థ ఎన్నికలు ఒక సవాలుగా మారాయి. ఒక విధంగా సెస్ ఎన్నికలు ప్రతిష్టాత్మకతను సంతరించుకున్నాయి. పైగా కేటీఆర్ బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగా, బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో ఈ ఎన్నికలను ఇరువురు నాయకులు పోటాపోటీగా తీసుకున్నారు. 

రాజకీయ పార్టీల ప్రమేయం ఉండొద్దని ఉన్నా..

సెస్​ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయం ఉండవద్దని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. అయినప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలు తెర వెనుక ఉండి తమ అభ్యర్థులను పోటీలోకి దించాయి. 15 డైరెక్టర్ స్థానాలకు75 మంది పోటీపడ్డారు. సుమారు వారం రోజులపాటు ప్రచారంలో హంగు ఆర్భాటం, ధన ప్రవాహం, మద్యం సీసాల సరఫరా నిర్విఘ్నంగా ఊరూరా ప్రతి ఓటరుకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చేరిందనేది విశ్లేషకుల మాట. ఎంత వీలైతే అంత తమ తమ శక్తి యుక్తులను ధారబోసి ఓటర్ మహాశయులను పోటీ చేసిన వ్యక్తులు ప్రలోభాలకు గురి చేసినట్లు తెలుస్తున్నది. ఓటు ధర రూ.500 నుంచి 2500 రూపాయల వరకు పలికినట్లు వార్తలొచ్చాయి. సహజంగానే అధికార పార్టీకి ఎక్కువ శాతం అనుకూల అంశాలు ఉంటాయి.  ప్రధాన ప్రత్యర్థి వర్గమైన బీజేపీ బలపరిచిన వారు ఎన్నికల కార్య క్షేత్రంలో గట్టి పోటీ ఇచ్చారు. 15 స్థానాల్లో ఒక్క వేములవాడ గ్రామీణ డైరెక్టర్ స్థానాన్ని బీజేపీ బలపరిచిన వ్యక్తి 5 ఓట్ల మెజార్టీతో కైవసం చేసుకున్నాడు.  మిగతా14 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తులు విజయకేతనం ఎగురవేశారు. అంతేగాక రేపు జరగనున్న పాలకవర్గం ఎన్నికల్లో చైర్మన్ స్థానాన్ని సునాయాసంగా పొందేందుకు తన మార్గాన్ని అధికార పార్టీ సుగమం చేసుకున్నది. 

ఎన్నికల వ్యవహార శైలి..

సెస్ ఎన్నికల ఫలితాలు సిరిసిల్ల శాసనసభ, వేములవాడ శాసనసభ స్థానాలను పూర్తిగా, పరోక్షంగా చొప్పదండి, మానకొండూర్ స్థానాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ ఎన్నికలు పది నెలల తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సూక్ష్మస్థాయిలో తాలింకానా అని కూడా చెప్పవచ్చు. ఎన్నికల వ్యవహార శైలి, ఫలితాల తీరు తెన్నులను సమీక్షించుకుంటే, ఒక విషయం స్పష్టంగా నమ్మకంగా బోధపడుతున్నది. అది ‘సినిమా చూపిస్తున్నారు.. కాబట్టి ప్రేక్షకులు చూస్తున్నారు.. ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నాం’ అనే యోచనలో పస ఎంత ఉందో ఎన్నికల్లో అంతే రొడ్డ కొట్టుడు వాదన ఒకటి తెరపైకి వస్తున్నది. ఓటర్ మారాలని నాయకుడు, నాయకుడు మారాలని ఓటర్ అంటుండగా, వారి, వీరి గోత్రాలు చెప్పే ఎన్నికల కమిషన్ చిత్రాలు చూస్తూ ఉండటం గమనార్హం.

హైకోర్టు తీర్పుతో ఎన్నికలు

సహకార రంగం చట్ట పరిధిలో ఈ సంస్థ (సెస్) 1969 నవంబర్​1న ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంఘంగా రిజిస్ట్రేషన్ పొందింది.1970 నుంచి గ్రామీణ విద్యుత్ సంస్థ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహాయ సహకారాలతో సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల పాత తాలూకాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నది. ఇటీవల సంస్థ 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని 53వ సంవత్సరంలో అడుగు పెట్టింది. గ్రామీణ ప్రాంతంలో అది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యంత మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో నాటి శాసనసభ్యులు రాజకీయ యోధులు చెన్నమనేని రాజేశ్వరరావు చొరవతో ఏర్పాటైంది. 2021 జనవరి నాటికి ఎన్నికైన పాలకవర్గం కాల వ్యవధి పూర్తయింది. కానీ ప్రభుత్వం పర్సన్ ఇన్​చార్జీగా జిల్లా కలెక్టర్ ను నియమించింది. అనంతరం రాజకీయ నాయకులతో ఒక కమిటీని వేశారు. తక్షణం సెస్ సంస్థకు ఎన్నికలు నిర్వహించాలని ఒక వినియోగాదారుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్ర హైకోర్టు, ప్రభుత్వ వాదనలను సదరు కక్షిదారుని వాదోపవాదాలను విన్న తర్వాత సంస్థకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల డిసెంబర్ 24న ఎన్నికలు జరిగాయి. 

- జూకంటి జగన్నాథం, కవి, రచయిత