
గాజియన్టెప్(టర్కీ) : టర్కీ, సిరియాలో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ డెడ్ బాడీలు బయటపడుతూనే ఉన్నాయి. గాజియన్టెప్లో మైనస్ ఐదు డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. శిథిలాలపై కూర్చోవడానికి కూడా అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఆ సిమెంట్ దిమ్మెల కింద ఎవరైనా ప్రాణాలతో ఉండొచ్చని భావిస్తున్నారు. చిన్న పిల్లలు చలికి గడ్డకట్టిపోతున్నారు. భూకంపం సంభవించి 72 గంటలు గడిచిపోయాయి. దీంతో గాయాలతో శిథిలాల కింద ఇంకా బతికి ఉండటం కష్టమని, ఎవరన్నా బతికిబయటపడడమంటే అద్భుతమేనని అధికారులంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్, వాటర్ ఉండాలని, లేకపోతే హైపోథెర్మియా బారినపడి చనిపోతారని చెబుతున్నారు. ఆయా దేశాల నుంచి గాజియన్టెప్ సిటీకి వచ్చిన బ్లాంకెట్లు, స్వెటర్ల కోసం పేరెంట్స్ క్యూ కడుతున్నారు. అంబులెన్స్ సైరన్లు, బుల్డోజర్ ఇంజన్, డ్రిల్ మిషన్ల సౌండ్లతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.
5 నుంచి 6 మీటర్లు జరిగిన టర్కీ
సోమవారం నుంచి గురువారం దాకా టర్కీలో 1,100 సార్లు భూమి కంపించింది. సోమవారం సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ధాటికి టర్కీ 5 నుంచి 6 మీటర్ల మేర పక్కకు జరిగినట్లు ఇటలీకి చెందిన సిస్మాలజిస్ట్ ప్రొఫెసర్ కార్లో డగ్లియాని తెలిపారు. టెక్టానిక్ ప్లేట్స్ మధ్య రాపిడి కారణంగానే భూకంపం సంభవించినట్లు వెల్లడించారు. సిరియాతో పోలిస్తే టర్కీనే 5 నుంచి 6 మీటర్లు భౌగోళికంగా పక్కకు జరిగినట్లు తెలిపారు.
17వేలు దాటిన మృతులు
టర్కీ, సిరియాలో గురువారం నాటికి మృతుల సంఖ్య 17 వేలు దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కేవలం టర్కీలోనే 14 వేల మందికి పైగా చనిపోయారు. సుమారు 70వేల మంది గాయపడ్డారు. 1,10,000 మంది రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. 5,500 వెహికల్స్ (ట్రాక్టర్లు, క్రేన్లు, బుల్డోజర్లు, ఎక్స్కవేటర్లు) సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని టర్కీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. సిరియాలో 3,500 మందికి పైగా చనిపోయారు.
రెస్క్యూ పనుల్లో వేగం పెరగాలె : ఎర్డోగాన్
టర్కీ అధ్యక్షుడు రెసెస్ తయ్యిప్ ఎర్డోగాన్ గురువారం గాజియన్టెప్, ఉస్మానియేతో పాటు కిలిస్ లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రిలీఫ్ క్యాంపులో ఉన్నవారిని పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్లో లోటుపాట్లు నిజమేనని అంగీకరించారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందనివివరించారు. రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ చేస్తామని వివరించారు.
మనోళ్లు చిన్నారిని కాపాడిన్రు
‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో టర్కీలో ఇండియన్ ఎన్డీఆర్ఎఫ్ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. గాజియన్టెప్ సిటీలో ఆరేండ్ల చిన్నారిని ఇండియా–11 టీం కాపాడింది. ఈ విషయాన్ని హోంశాఖ ట్విటర్లో తెలిపింది.