
- బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అసంతృప్తుల టెన్షన్..
- ప్రచారంలో కలిసిరాని ఆశావహులు
- లోకల్ లీడర్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు
- నాయకులను బుజ్జగించేందుకు రంగంలోకి మంత్రి కేటీఆర్?
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలోని బీఆర్‌ఎస్ అభ్యర్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. సిట్టింగ్‌లకు టికెట్ వచ్చిందన్న సంతోషం కంటే అసంతృప్తుల నుంచి సహకారం అందకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. అసంతృప్తుల కారణంగా కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించగా మరికొందరు వెనకంజ వేస్తున్నారు. ఇప్పుడే తొందరపడి ప్రచారం నిర్వహించుకుని డబ్బులను ఖర్చు చేసే కంటే పార్టీ అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా అసంతృప్త నేతల ఒత్తిడికి అధిష్టానం లొంగి ఒకవేళ అభ్యర్థులను మారిస్తే పరిస్థితి ఏందన్న విషయంపైనా కొందరు సిట్టింగ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్‌పరిధిలోని 24 సెగ్మెంట్లలో పదరహారింట బీఆర్‌ఎస్ సిట్టింగ్‌లు ఉన్నారు. ఇప్పటికే ఉప్పల్ సెగ్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డిని కాదని లక్ష్మారెడ్డికి టికెట్ ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించే సమయంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయని అన్నారు. దీంతో చాలా సెగ్మెంట్లలో సిట్టింగ్‌లు ప్రచారాన్ని ప్రారంభించకుండా పరిస్థితి సద్దుమణిగే వరకూ వేచి చూడాలని నిర్ణయించారు.
సీనియర్ నేతల నుంచి వ్యతిరేకత..
గ్రేటర్ పరిధిలోని బీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్థుల్లో చాలామందికి నియోజకవర్గంలోని సీనియర్లు, టికెట్ఆశించి భంగపడిన వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా మంది అభ్యర్థులు అసంతృప్తులకు రాయబారాలు పంపినా ప్రయోజనం దక్కలేదని సమాచారం. ముఖ్యంగా అంబర్‌పేట, ఉప్పల్, శేరిలింగంపల్లి, ఎల్ బీనగర్, ముషీరాబాద్ లాంటి సెగ్మెంట్లలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు అసంతృప్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అంబర్‌పేటలో సిట్టింగ్ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు ఈసారి టికెట్ఇవ్వొద్దని నియోజకవర్గంలోని సీనియర్ లీడర్లు, పలువురు కార్పొరేటర్ల నుంచి డిమాండ్ వస్తున్నది. దీంతో కాలేరు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు వెనకాడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయనకు కాకుండా మరెవరికి ఇచ్చినా మేం పార్టీని గెలిపించుకుంటామని పలువురు సీనియర్ నాయకులు అధిష్టానానికి చెబుతున్నట్లు సమాచారం.
ALSO READ: కర్నాటక కాంగ్రెస్ నేత ఇంట్లో 42 కోట్లు పట్టివేత.. స్వాధీనం చేసుకున్న ఐటీ ఆఫీసర్లు
ఈ విషయంపైనే ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసంతృప్తులను పిలిపించుకుని మాట్లాడారు. ఆయన ఎంత చెప్పినా వారు కాలేరు అభ్యర్థిగా ఉంటే తాము పని చేయమని స్పష్టం చేశారు. ఆయన కూడా ఏం చేయాలో తెలియక ఈ విషయంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ముషీరాబాద్ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌కు టికెట్ ఇవ్వొద్దని చాలామంది నియోజకవర్గం నాయకులు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆయనకు టికెట్ ఇచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత ఎంఎన్ శ్రీనివాస్ టికెట్ఆశిస్తున్నారు. ఆయన చాలా రోజుల నుంచి ముఠా గోపాల్ తరఫున ప్రచారం చేయడం లేదు. గత ఎన్నికల్లో ఎల్ బీనగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన సుధీర్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు.
తాజాగా తిరిగి ఆయనకే ఎల్బీనగర్ టికెట్ దక్కింది. దీంతో గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ ఈసారి తనకు టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శేరిలింగంపల్లి నుంచి సిట్టింగ్ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మళ్లీ టికెట్ ఖరారైంది. ఇక్కడ చాలా కాలంగా టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత బండి రమేశ్ఆయన మద్దతుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉప్పల్ సెగ్మెంట్లోనూ సిట్టింగ్ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని కాదని లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో సుభాష్‌రెడ్డి, ఆయన మద్దతుదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తొందరలోనే ప్రత్యేక సమావేశం
బీఆర్‌ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులను కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టడానికి సిటీకి చెందిన మంత్రి తలసాని ప్రయత్నం చేసినా పరిస్థితి మారడం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్నేరుగా రంగంలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను వ్యతిరేకిస్తున్న వారిని పిలిచి త్వరలో ప్రత్యేకంగా సమావేశం కావాలని కేటీఆర్భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ మళ్లీ గెలిస్తే వారికి తగిన రీతిలో పార్టీ గుర్తింపునిస్తుందని బుజ్జగించనున్నట్టు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో టికెట్తమకే కేటాయించాలన్న డిమాండ్ వస్తున్నది. మరి సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా అవసరమైతే ఏవైనా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తారా లేదా అన్న విషయం పైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే బీఆర్‌ఎస్ అభ్యర్థుల మార్పులు ఉంటాయనేది తెలుస్తోంది.