ఎల్ బీనగర్: సిటీ శివార్లలో మ్యాన్ హోల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎల్ బీనగర్ సెగ్మెంట్ పరిధిలో మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయంటూ వాటర్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానికులే మ్యాన్ హోల్స్ ను తెరిచి నీటిని క్లియర్ చేసుకుంటున్నారు. నాగోల్ పరిధి బండ్లగూడలో ఉండే ఓ వ్యక్తి ఇంటి ముందు డ్రైనేజీ సమస్య రావడంతో వాటర్ బోర్డు హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి అధికారులకు కంప్లయింట్ చేశాడు.
మ్యాన్ హోల్స్ లో చెత్త పేరుకుపోయి డ్రైనేజీ ఇంట్లో నుంచి బయటికి సాఫీగా వెళ్లట్లేదని.. తిరిగి ఆ నీరంతా ఇంట్లోకే వస్తోందంటూ కంప్లయింట్ లో పేర్కొన్నాడు. అయితే, సదరు అధికారులు సమస్యను పరిష్కరించకుండానే కంప్లయింట్‌ను ఆన్ లైన్ లో క్లోజ్ చేసేశారు. దీంతో ఆ వ్యక్తి ఇంటి ముందున్న మ్యాన్‌హోల్ ను తెరిచి నీటిని క్లియర్ చేశాడు. ఇలా వందల సంఖ్యలో కంప్లయింట్లను అధికారులు పరిష్కరించకుండానే క్లోజ్ చేస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా.. తాము ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నట్లు చెబుతున్నారు.