మూడు గ్రూపులుగా చీలిన పార్టీ నేతలు
కోదాడ సభలో బయటపడ్డ విభేదాలు
మీటింగ్‌కు హాజరుకాని ఎంపీ కోమటిరెడ్డి
ఒక జట్టుగా ఎంపీ ఉత్తమ్, జానా, దామోదర్ రెడ్డి
ఇరకాటంలో పడ్డ పీసీసీ చీఫ్ రేవంత్ టీం
భువనగిరి జిల్లా 'జోడో' మీటింగ్‌పై ఉత్కంఠ
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటగా తయారైంది. హాత్ సే హా త్ జోడో యాత్రలో భాగంగా పార్టీ అగ్రనేతలు ఏకతాటిపైకి వస్తారని భావించిన హైకమాండ్‌కు నిరాశే ఎదురైంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే ప్రత్యేక ఫోకస్ పెట్టినా అగ్రనేతల మధ్య విభేదాలు సమసిపోవడం లేదు. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు కలిపి ఈనెల 1న కోదాడలో నిర్వహించిన హాత్‌సే హాత్ జోడో యాత్ర సభకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు. ఈ మీటింగ్‌కు రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలోని ముఖ్యనేతలు హాజరుకావాలని గాంధీభవన్ నుంచి ఆదేశాలున్నాయి. పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కూడా అందరికీ పర్సనల్‌గా సమాచారమిచ్చారు. అయితే తాను సపరేట్‌గా మీటింగ్పెట్టుకుంటానని వెంకటరెడ్డి గాంధీభవన్ వర్గాలకు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం తెలియక అప్పటికే కోదాడ చేరుకున్న నకిరేకల్, మునుగోడు నేతలు కొండేటి మల్లయ్య, పాల్వాయి స్రవంతిలను మీటింగ్ లోపలికి అనుమతించలేదు. అంతకుముందే నల్గొండ, భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల్లోని కోమటిరెడ్డి వర్గం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వర్గం లీడర్లు మీటింగ్‌కు పోవద్దని డిసైడయ్యారు. అయితే నల్గొండలోని వెంకటరెడ్డి ముఖ్యఅనుచరులు మీటింగ్‌కు పోకుండా సెకండ్ కేడర్ లీడర్లను కోదాడకు పంపడంతో వారికి అక్కడ ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఆయా నియోజకవర్గాల్లో జోడో యాత్రను ముందుండి నడిపించాల్సిన సీనియర్లు మీటింగ్పోకపోవడంపై జోడో యాత్ర పట్ల వారికి ఆసక్తి లేనట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ మెంబర్షిప్ విషయంలో కూడా నల్గొండలో వెంకటరెడ్డి వర్గం ఇదే వైఖరి అవలంబించింది. తమ నాయకుడు వస్తే తప్ప నియోజకవర్గం నేతల్లో చలనం ఉండట్లేదని సెకండ్ కేడర్ నారాజ్ అవుతోంది.
ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డిలది ఓ జట్టు
జోడో యాత్ర సభ ద్వారా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య లీడర్ల వైఖరిపై ఓ క్లారిటీ వచ్చినట్లయింది. మునుగోడు బైఎలక్షన్నుంచే ఎంపీ కోమటిరెడ్డితో దూరంగా ఉంటున్న ఎంపీ ఉత్తమ్, సీనియర్లు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి ఒక జట్టుగా జిల్లా రాజకీయాలను నడిపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సూర్యాపేటలో రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరుడు పటేల్ రమేశ్‌రెడ్డిని కోదాడ మీటింగ్ పిలవనట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలోనూ బత్తుల లక్ష్మారెడ్డి వర్గీయులపై డీసీసీ ప్రెసిడెంట్శంకర్నాయక్ వర్గం దాడి చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జిల్లా ముఖ్య నేతలు పెద్దగా పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్ ఆశిస్తున్న లక్ష్మారెడ్డి జిల్లా ముఖ్యనేతలతో సఖ్యతగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నా తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, తన వర్గంపైన దాడికి పాల్పడ్డ శంకర్‌నాయక్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ ముఖ్యులను కోరారు. మరోవైపు మిర్యాలగూడలో జానారెడ్డి కొడుకు రఘువీర్‌రెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో ఉండటంతో లక్ష్మారెడ్డి పట్ల పార్టీ నేతలు ఏరకంగా స్పందిస్తారన్నది వేచిచూడాల్సిందే.
వెంకటరెడ్డి మీటింగ్‌పై ఆసక్తి
ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జోడో యాత్ర సభ పెట్టాలన్నది పార్టీ హైకమాండ్ ఆలోచన. తొలుత భువనగిరి జిల్లాలో ఫిబ్రవరి 28న మీటింగ్ పెట్టాలనుకున్నారు. కానీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో జోడో యాత్ర సన్నాహక మీటింగ్‌లు జరుగుతున్నాయి. వెంకటరెడ్డి నిర్ణయం కోసం భువనగిరి జిల్లా కేడర్ ఎదురుచూస్తోంది. హోలీ అనంతరం మీటింగ్ పెట్టే ఆలోచన ఉన్నట్టు తెలిసింది. కానీ ఈ మీటింగ్‌కు రేవంత్, ఉత్తమ్, దామోదర్‌రెడ్డి టీమ్‌లను పిలుస్తారా లేదా అన్నది పార్టీలో చర్చ జరుగుతోంది. భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఉత్తమ్ వర్గం కాగా, తుంగతుర్తి సెగ్మెంట్ దామోదర్ రెడ్డి కంట్రోల్‌లో ఉంది.
ఇక మునుగోడు, నకిరేకల్‌లో రేవంత్‌రెడ్డి అనుచరులు కీలకంగా మారారు. వెంకటరెడ్డి మీటింగ్‌పైన నమ్మకం పెట్టుకోని రేవంత్‌వర్గం ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో జోడో యాత్ర మొదలుపెట్టింది. ఇవే పరిస్థితులు ఎన్నికల వరకు కొనసాగితే పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని పార్టీ ముఖ్యనేతలు వాపోతున్నారు.