నారాయణపేట, వెలుగు: ప్రభుత్వం టీచర్లను చిన్న చూపు చూస్తోందని, పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం ఎందుకని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కానుగంటి హనుమంతరావు ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో శేర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో ఆకాంక్షలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విద్యారంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందన్నారు. ఏడేండ్లుగా పదోన్నతులు లేవని, ఎంతోమంది టీచర్లు ఒకే క్యాడర్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్నారని వాపోయారు. గత డిసెంబర్‌లో తీసుకొచ్చిన 317 జీవోతో ఎంతోమంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. మన ఊరు–మనబడి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యారంగ సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు గుంపు బాలరాజ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, జిల్లా నాయకులు నర్సింగప్ప, గుర్నాథ్ రెడ్డి, సీతారాములు, అంబరీశ్, శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట, ఉట్కూర్, దామరగిద్ద అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, రవికుమార్, చిన్న నరసింహులు, కృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.
సైన్స్ ఫేర్ మెమెంటోలపై టీఆర్ఎస్ లీడర్ ఫొటో
గద్వాల, వెలుగు: ప్రభుత్వం నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న స్టూడెంట్లకు ఇచ్చే మెమెంటోలపై దివంగత టీఆర్ఎస్ లీడర్ ఫొటో పెట్టడం విమర్శలకు దారి తీసింది. డీఈవో కన్వీనర్‌గా ఉన్న జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌ను ఈ నెల 1 నుంచి 3 వరకు అయిజలోని కృష్ణవేణి స్కూల్‌లో నిర్వహించారు. విద్యార్థులు వివిధ అంశాలపై రూపొందించిన ఎగ్జిబిట్లకు మెమెంటోలు ఇచ్చారు. అయితే వీటిపై ఇటీవల చనిపోయిన అయిజ మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ ఉత్తనూరు తిరుమల్ రెడ్డి ఫొటో పెట్టారు. పైగా ‘తిరుమల్ రెడ్డి ఆశ సాధనకు కృషి చేద్దాం’ అని రాశారు. దీంతో సైన్స్‌ఫేర్‌లో రాజకీయం ఏంటని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. డీఈవో సిరాజుద్దీన్‌ను వివరణ కోరగా.. మెమెంటోలు డొనేషన్ చేయడం వల్లే ఆయన పేరు పెట్టాల్సి వచ్చిందని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు.
కర్నాటక లిక్కర్ పట్టివేత ..ఇద్దరి అరెస్ట్
గద్వాల టౌన్, వెలుగు: కర్నాటక నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న లిక్కర్‌ను ఎక్సైజ్ పోలీ సులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐలు గోపాల్, పటేల్ బానోత్ వివరాల ప్రకారం.. కేటిదొడ్డి మండలం చింతలకుంట దగ్గర ఆదివారం తెల్లవారుజామున డీటీఎఫ్, ఎస్‌హెచ్‌వో టీంలు రూట్ వాచ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఫోర్డ్ ఫియస్టా కారును తనిఖీ చేయగా.. నాలుగు కార్టన్ల ఒరిజినల్ ఛాయిస్ విస్కీ (180 ఎంఎల్ టెట్రా ప్యాక్), 21 కాటన్ల ఒరిజినల్ ఛాయిస్ (90 ఎంఎల్ ప్యాక్ టెట్రా ప్యాక్) కర్ణాటక లిక్కర్ దొరికింది. కారులో ఉన్న అలంపూర్ మండలం జిల్లెల్లపాడుకు చెందిన మద్దిలేటి, నరసింహ నాయుడును అదుపులోకి విచారించగా.. లిక్కర్‌ను రాయచూరు నుంచి నందికొట్కూర్ కు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో కారును సీజ్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
నేటి నుంచి అంజన్న బ్రహ్మోత్సవాలు
మక్తల్, వెలుగు: నేటి నుంచి మక్తల్ పట్టణంలోని పడమటి అంజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం టెంపుల్సమీపంలోని రాంలీల మైదానాన్ని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వొద్దని, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంబడి మాగ నూరు జడ్పీటీసీ వెంకటయ్య , నేరడగొం సర్పంచ్ అశోక్ గౌడ్, నేతలునర్సింహారెడ్డి ఉన్నారు.