రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నో వేలు ఖర్చు పెట్టి పంట పండించి మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లి అమ్మే దాకా రైతుకు నమ్మకం లేకుండా పోతోంది. పంట చేతికి వచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పెట్టిన పెట్టుబడి మట్టిపాలవుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో మొన్న వరి, నిన్న పత్తి, ఇప్పుడు మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిని రైతన్నలను నట్టేట ముంచాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల ఎకరాల్లో మిర్చి పంట నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. మిర్చి సాగు కోసం ఎకరాకు రైతులు రూ. లక్షా 10 వేల నుంచి రూ. లక్షా 25 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో నష్టపోవడం వల్ల అప్పులు ఎక్కువై ఇప్పటికే పది మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఒక్క ప్రకటన కూడా రాలేదు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద ఇచ్చే మొత్తంతో సమస్యలన్నీ పోతాయనే భ్రమలో పాలకులు ఉన్నారు. రైతులకు ఇచ్చే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ సబ్సిడీని కూడా ఇవ్వటం లేదు. 

పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పినా..
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, మూడు నెలల లోపు పంట నష్టపోయిన రైతుల పూర్తి జాబితా తయారు చేయాలని, మరో నెలలోపు వారందరికీ నష్టపరిహారం అందించాలని రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్ 28న చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అంతేగాక పంట బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల కలిగిన నష్టాన్ని కూడా పూడుస్తూ బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్న నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాష్ట్ర సర్కారు నష్టపరిహారం విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ప్రభుత్వ అధికారిక నివేదిక ప్రకారమే 2020 అక్టోబర్ లో 15 లక్షల ఎకరాల్లో తీవ్ర నష్టం జరిగింది. జిల్లాల వారీగా ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో అంచనా వేసి నివేదికలు పంపితే కేంద్ర ప్రభుత్వం రూ.185 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులు కూడా ఇంతవరకు రైతులకు అందించలేదు. 

బీమా పథకం అమలు చేయాలి
రెండేండ్లుగా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయకపోవడం వల్ల కోట్లాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేకమైన రాష్ట్ర స్థాయి పంట బీమా పథకాలు అమలవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో రద్దు చేసింది. ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా ఎలాంటి పంటల బీమా పథకం అమలు కావడం లేదు. దీని వల్ల ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులు పెట్టుబడులు పెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది రైతుల ఆత్మహత్యలకు ప్రకృతి వైపరీత్యాలే కారణంగా తెలుస్తోంది. కనీసం రైతులకు నష్టపరిహారంగా కొంతైనా అందితే ఉపశమనంగా ఉంటుంది. కానీ ఎలాంటి సాయం లేని కారణంగా రైతులు అచేతన స్థితికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సమస్యను కేంద్రంపైకి నెట్టేయకుండా నష్టపోయిన రైతులకు పరిహారం అందించే ప్రక్రియను వేగవంతం చేయాలి. 
అది జరిగితేనే రైతులు వ్యవసాయాన్ని పండుగగా భావిస్తారు. అప్పుడే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది తప్పితే, రైతులకు రైతుబంధు ఇవ్వడం ద్వారానో, బీమా ఇవ్వడం ద్వారానో లాభం చేకూరదు. అన్ని విధాలుగా రైతులను ఆదుకున్నప్పుడే రైతు రాజవుతాడని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి.

- చింత ఎల్లస్వామి, రీసెర్చ్​ స్టూడెంట్, ఉస్మానియా  యూనివర్సిటీ