- చిన్న వర్షానికే కుంటలను తలపిస్తున్న స్కూళ్ల గ్రౌండ్లు
ఖమ్మం, వెలుగు : వర్షాల కారణంగా జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు చిన్న పాటి చెరువులు, నీటికుంటలను తలపిస్తున్నాయి. స్టూడెంట్స్ బడిలోకి వెళ్లాలంటే.. బురదలో నుంచి నడవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గిన తర్వాత నాలుగైదు రోజుల వరకు కూడా ఇదే దుస్థితి ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మం జిల్లాలో 813 ప్రాథమిక పాఠశాలలు, 191 ప్రాథమికోన్నత పాఠశాలలు, 222 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటన్నింటిలో మొత్తం 66, 252 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ఊరు, మన బడి పథకం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో జిల్లాలో దాదాపు 450కు పైగా స్కూళ్లలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.42 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేయాలని భావించినా, ఇంకా పలు దశల్లో పనులు జరుగుతూనే ఉన్నాయి. నిల్చిన వాన నీటిలో ఈగలు, దోమల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు చాలా వరకు పదేళ్లు, అంతకంటే ముందు నిర్మించినవే ఉన్నాయి. అప్పటి రోడ్లకు సమాంతరంగా స్కూల్ భవనాలు నిర్మించగా, ఆ తర్వాత సీసీ రోడ్లు, ఇతర రోడ్ల అభివృద్ధి కారణంగా ఇప్పుడు రోడ్డు లెవల్ కంటే బిల్డింగ్ లు, వాటి ఆవరణ లోతట్టుగా మారాయి. దీంతో స్కూళ్లలో వర్షం నీరు నిలవకుండా వెంటనే బయటకు వెళ్లేలా మట్టితో లెవల్ చేస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని పేరెంట్స్సూచిస్తున్నారు.