కాలిన మోటార్లు.. పైపుల్లో లీకులు.. పని చేయని తుమ్మల లిఫ్ట్​

  • కాలిన మోటార్లు.. పైపుల్లో లీకులు..
  • పని చేయని తుమ్మల లిఫ్ట్​
  • సాగునీరు అందించలేని దుస్థితి 
  • ఐటీసీ దత్తత గ్రామంలో అన్నదాతల అగచాట్లు

భద్రాచలం, వెలుగు : ‘పేరుకే ఎత్తపోతల పథకం. కాని దానికి ఉత్తపోతల పథకం’ అని పిలవాలని రైతులు అంటున్నారు. బూర్గంపాడు మండలంలోని ఇరవెండి గ్రామంలో గోదావరిపై నిర్మించిన తుమ్మల ఎత్తిపోతల పథకం సాగునీరు అందించలేకపోతోంది. ఐదేళ్లుగా ఒకే మోటారుపై నడుస్తున్నా పాలకుల కళ్లకు అన్నదాతల అగచాట్లు కన్పించడం లేదు. ఐటీసీ పేపరు బోర్డు దత్తత తీసుకున్న గ్రామంలోనే ఉన్న లిఫ్ట్​ను వారు కూడా పట్టించుకోవడం లేదు. 1800 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ఈ ఎత్తిపోతల పథకం కేవలం 200 ఎకరాలకే ముక్కుతూ, మూలుగుతూ నీటిని సరఫరా చేస్తోంది. 

సమస్యలు ముసిరి...

2002లో ఇరవెండి గ్రామంలోని గోదావరిపై తుమ్మల ఎత్తిపోతల పథకాన్ని రూ.3.06కోట్ల వ్యయంతో అప్పటి ప్రభుత్వం నిర్మించింది. 1800 ఎకరాల ఆయకట్టుకు నీరందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. నాలుగు మోటార్లు బిగించారు. సుమారు కిలోమీటరు మేర అండర్​గ్రౌండ్​లో డబుల్ పైపులైన్ వేశారు. ఊరి రోడ్డు ఆవల రెండో దశ నిర్మాణం చేపట్టి అక్కడి నుంచి సింగిల్​పైపులైన్​ద్వారా కాల్వల గుండా పొలాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే ఐదేళ్లుగా కేవలం ఒక మోటారుతోనే నెట్టుకువస్తున్నారు.

మూడు మోటార్లు కాలిపోయాయి. అవి మూలనపడ్డాయి. ఉన్న ఒక్క మోటారుతోనైనా నీరు తోడితే అవి కాస్తా పైపులు లీకై వృథాగా పోతున్నాయి. పొలాలకు చుక్కనీరు అందే పరిస్థితి లేదు. కేవలం 200 ఎకరాలకు మాత్రమే నీరు వస్తోంది. మిగిలిన 1600 ఎకరాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. వర్షం కురిస్తేనే పంట. లేకుంటే పొలాలన్నీ పడావుగా ఉండాల్సిందే. ఈ ఎత్తిపోతలకు కరెంట్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్లు సైతం కాలిపోయాయి. కేవలం ఒక ట్రాన్స్ ఫార్మర్​ను ఇటీవల ఏర్పాటు చేశారు. 

అంతా సన్న, చిన్నకారు రైతులే..

తుమ్మల ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుదారులంతా సన్న, చిన్నకారు రైతులే ఉన్నారు. వారు ఈ పొలాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువ మంది ఉన్నారు. వీరి ఆయకట్టు 1000 ఎకరాలు ఉంటుంది. ఐదేళ్లుగా సాగునీరు అందక నానాతిప్పలు పడుతున్నారు. పంటలు పండక వారంతా వ్యవసాయాన్ని వదిలేసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ లిఫ్ట్ నిర్మించిన చోటనే ఐటీసీ పేపరు బోర్డుకు గోదావరి నీళ్లు వెళ్లే స్కీం ఉంది. ఇరవెండి గ్రామాన్ని ఐటీసీ దత్తత తీసుకున్నా రైతుల కన్నీళ్లను తుడిచేందుకు ముందుకు రావడం లేదు. కాలిపోయిన మోటార్ల స్థానంలో కొత్తవి, పైపులైన్ల మరమ్మతులు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు పెద్ద లెక్క కూడా కాదు. దత్తత గ్రామంలో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ఐటీసీ సంస్థ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు.

రిపేర్లు చేయించాలె..

తుమ్మల ఎత్తిపోతలకు రిపేర్లు చేయిస్తలేరు. మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలినయి. పైపులైన్లు దెబ్బతిన్నయి. మా పంటలకు ఈ నీరే దిక్కు. ఐదేళ్లుగా ఇబ్బందులు పడుతున్నం. పంటలు సాగు చేసి నీళ్ల కోసం ఆకాశం వంక చూస్తున్నం. ఇంకెప్పుడు మంచిగ జేస్తరు.

–లావునూరి రామిరెడ్డి, రైతు, ఇరవెండి

అంచనాలు తయారు చేస్తున్నాం..

ఇరవెండి తుమ్మల ఎత్తిపోతల పథకం రిపేర్లకు అంచనాలు తయారు చేస్తున్నాం. డిటైల్​రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. రూ.కోటికి పైగా నిధులు అవసరమవుతాయి. నిధులు వస్తే వెంటనే పనులు చేపడతాం. రైతులకు సాగునీరు అందిస్తాం.

– తెల్లం వెంకటేశ్వరరావు, ఈఈ, ఇరిగేషన్