
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నా, వినియోగదారుల ఖర్చు సామర్థ్యంలో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోంది. ఇటీవలి బ్లూమ్ వెంచర్స్ విశ్లేషణ ప్రకారం, 140 కోట్ల జనాభాలో దాదాపు 100 కోట్ల మంది తమ ఖర్చులను గణనీయంగా పరిమితం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు స్థిరమైన ఆదాయంతో స్వేచ్ఛగా ఖర్చు చేయగలిగే వారు కేవలం 13-14 కోట్ల మంది మాత్రమేనని ఈ అధ్యయనం సూచిస్తోంది.
అంటే భారత మార్కెట్‌ను అర్థం చేసుకోవాలంటే కేవలంజనాభా పరంగా కాకుండా, ప్రజల ఆదాయ స్థాయిలను, ఖర్చు విధానాలను విశ్లేషించడం అవసరం. భారత్‌లో ఆర్థిక అసమతుల్యత గణనీయంగా ఉంది. నగరాల్లో ఉన్నత, మధ్య తరగతులకు మంచి ఆదాయ వృద్ధి కనిపిస్తున్నా, గ్రామీణప్రాంతాల్లో ఇంకా తక్కువ ఆదాయ స్థాయిలు కొనసాగుతున్నాయి.
ఆదాయ వ్యవస్థ మెరుగుపడకపోతే వినియోగదారుల ఖర్చు సామర్థ్యం పెరగదు. దేశంలో చాలా మంది అనిశ్చిత ఉపాధిపై ఆధారపడటంతో, నిర్దిష్ట ఆదాయ స్థాయిని చేరుకోవడం కష్టమవుతోంది. 100 కోట్ల మంది వినియోగదారులు వ్యక్తిగత ఖర్చులను గణనీయంగా పరిమితం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. వీరి ఆదాయం ప్రధానంగా ఆహారం, వైద్యం, విద్య వంటి అవసరాలకే సరిపోతోంది. విలాస వస్తువులు, గృహోపకరణాలు, వినోదం, టూరిజం వంటి విభాగాల్లో వీరు పెద్దగా ఖర్చు చేయడం లేదు. ఈ వాస్తవం మార్కెట్ వ్యూహాలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.
మధ్యతరగతి, ఉన్నత వర్గాలే లక్ష్యం
భారత మార్కెట్‌ను అనేక కంపెనీలు మధ్యతరగతి, ఉన్నత వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని అభివృద్ధి చేశాయి. అయితే, వినియోగ సామర్థ్యం పరంగా చూస్తే, తక్కువ ఆదాయం గల వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, మార్కెట్ వ్యూహాలను పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ప్రీమియం ఉత్పత్తులతో పాటు, బడ్జెట్ -ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, స్థిరమైన ధరల వ్యూహాలు, ఫైనాన్స్- ఆధారిత వినియోగ మోడల్స్ ద్వారా ఈ వర్గాన్ని ఆకర్షించే మార్గాలను పరిశీలించాలి. భారత మార్కెట్ వృద్ధి కొనసాగాలంటే కేవలం ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా పెట్టుకోవడం సరిపోదు. తక్కువ ఆదాయ గల వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని, వారికి అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సేవలు రూపొందించాలి.
సరసమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి తేవడం, ఈఎంఐ లేదా ఫైనాన్స్ మోడళ్లను ప్రవేశపెట్టడం, గ్రామీణ మార్కెట్లకు చేరువ కావడం ద్వారా వినియోగదారుల స్థాయిని విస్తరించుకోవచ్చు. డిజిటల్ విస్తరణ ద్వారా కూడా ఈ వర్గానికి మార్కెట్‌ను మరింత చేరువ చేయొచ్చు. ఈ మార్గాల్లో వ్యూహాలు అమలు చేస్తే తక్కువ ఆదాయంగల వినియోగదారుల ఖర్చు సామర్థ్యం పెరిగి, భారత ఆర్థికవృద్ధికి కొత్త దిశలో ఉత్సాహం లభించవచ్చు. ఆర్థిక అసమతుల్యతను అధిగమించాలంటే ఉపాధి కల్పన సరైన పరిష్కారంగా పరిగణించాలి.
ప్రజల ఆదాయాన్ని పెంచేలా.. ప్రభుత్వ కార్యక్రమాలు..
ఉద్యోగ కల్పన పెంచడం, కార్మిక వేతనాలు పెంచడంతోపాటు, స్థిరమైన ఉపాధి అవకాశాలను పెంచడం, వ్యవసాయాన్ని ఆదాయ వృద్ధి మార్గంగా తీర్చిదిద్దేందుకు ఆధునికీకరణ, గోదాములు, ప్రత్యక్ష మార్కెటింగ్ విధానాలు అవసరం. వినియోగదారుల మార్కెట్ విస్తరణపై దృష్టి పెట్టడం అత్యవసరం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వృద్ధిని సాధించవచ్చు. కార్మికుల వేతనాలను పెంచడం ద్వారా మధ్యతరగతి వినియోగ శక్తిని మెరుగుపరచాలి.
వ్యవసాయ రంగంలో ఆధునికీకరణ, సరసమైన రుణాలు, నూతన మార్కెటింగ్ విధానాలు తీసుకురావడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ప్రజల ఆదాయాన్ని పెంచేవిధంగా ఉండాలి. చిన్న వ్యాపారాల పెరుగుదల కోసం నిధులు, మద్దతు, లోన్లు అందించాలి. మార్కెట్ విస్తరించాలంటే వినియోగదారుల ఆదాయాన్ని పెంచే విధానాలపై దృష్టి సారించాలి. భారతదేశ మార్కెట్‌ను అర్థం చేసుకోవాలంటే కేవలం జనాభాపరంగా కాకుండా, ఖర్చు సామర్థ్యం ఆధారంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. 100 కోట్ల మంది వినియోగదారులుగా ఉన్నా, మార్కెట్‌లో క్రియాశీలకంగా ఉన్నవారు 13-–14 కోట్ల మంది మాత్రమే. దేశం నిజమైన ఆర్థిక ప్రగతిని సాధించాలంటే, విభిన్న ఆదాయ వర్గాలకు అనుగుణంగా వృద్ధి వ్యూహాలను రూపొందించి, అమలుచేయడం కీలకం.
- శ్రీనివాస్ గౌడ్ ముద్దం