తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు.. సహకరించిన ఇద్దరు స్నేహితులు

తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు.. సహకరించిన ఇద్దరు స్నేహితులు

జైపూర్, వెలుగు : తల్లిని వేధిస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ 17 ఏండ్ల యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ మండలం ఇందారం గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రీధర్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య (45) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న రాజయ్య తన భార్య భాగ్యతో నిత్యం గొడవ పడేవాడు. 

కొన్ని రోజుల కింద కూడా భార్యతో గొడవపడడంతో పాటు తన కొడుకుపై దాడి చేశాడు. దీంతో భాగ్య తన కొడుకుతో కలిసి నస్పూర్‌‌లో ఉంటున్న అన్న ఇంటికి వెళ్లిపోయింది. ఎంత నచ్చజెప్పినా తండ్రి తన తీరు మార్చుకోవడం లేదని కోపం పెంచుకున్న కొడుకు.. తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని సర్వ గ్రామం, శ్రీరాంపూర్‌‌ అరుణక్కనగర్‌‌కు చెందిన తన ఫ్రెండ్స్‌‌కు చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు. 

దీంతో ముగ్గురు కలిసి గురువారం రాత్రి ఇందారంలో రాజయ్య వద్దకు వెళ్లి గొడవ పడ్డారు. తర్వాత కత్తితో రాజయ్య గొంతు కోసి హత్య చేశారు. అనంతరం ముగ్గురు కలిసి రాజయ్య ఆటోలో వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. జైపూర్‌‌ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్‌‌ ఇన్‌‌చార్జి సీఐ రవీందర్‌‌ శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.