తండ్రి బాలికపై రేప్ చేస్తే.. కొడుకు వీడియోతీసి పోలీసులకు పట్టిచ్చిండు
న్యూఢిల్లీ : ఢిల్లీలో 16 ఏండ్ల బాలికపై 68 ఏండ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వృద్ధుడి కుమారుడు ఫోన్లో రికార్డు చేశాడు. బాధితురాలి తండ్రికి ఆ వీడియో పంపడంతో అతడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ లో జరిగిన రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏప్రిల్ 20న ఇంటి బయట ఒంటరిగా ఉన్న బాలికను వృద్ధుడు ప్రలోభపెట్టి తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. అయితే, తన తండ్రి చేతబడి చేస్తున్నాడని అనుమానించిన నిందితుడి కొడుకు అతడి రూంలో సీక్రెట్ గా ఫోన్ ను అమర్చాడు. దీంతో ఈ అత్యాచార ఘటన అందులో రికార్డ్ అయింది.
ఆ వీడియోను అతడు ఇటీవల బాలిక తండ్రికి పంపించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఇంతకాలం వృద్ధుడికి భయపడిన ఆ బాలిక, వీడియో బయటకు రాగానే జరిగిందంతా పోలీసులకు చెప్పింది. నిందితుడిని, అతని కుమారుడిని విచారించిన తర్వాత వృద్ధుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు బాలిక ఉండే ఏరియాలోనే నివసిస్తాడని, వారి కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన టూర్లకు వెళ్లేవాడన్నారు. అలాగే, వృద్ధుడికి తన కొడుకుతో విబేధాలున్నాయని పోలీసులు చెప్పారు. బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి వైద్య పరీక్షలు చేయించామన్నారు.