
పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ కలాండర్స్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది తన బౌలింగ్తో అదరగొట్టాడు. అతడి బంతి వేగానికి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మన్ బ్యాట్ రెండు ముక్కలైంది. తొలి బంతికి మహ్మద్ హరీస్ బ్యాట్ విరిగింది. ఆ తర్వాత మరో బ్యాట్‌తో బ్యాటింగ్ కొనసాగించిన హరీస్‌ను షాహీన్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహీన్ సంధించిన బంతి వేగానికి ఆఫ్ స్టంప్ గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయింది.
పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా లాహోర్ కలాండర్స్ - పెషావర్ జల్మీల మధ్య మ్యాచ్ జరిగింది. ముందుగా పెషావర్ జల్మీ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో షాహీన్ షా తొలి ఓవర్ లో నిప్పులు చెరిగాడు. అఫ్రిది వేసిన మొదటి బంతి వేగానికి పెషావర్ జల్మీ ఓపెనర్ మహ్మద్ హారీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా అఫ్రిది బాల్ ను సంధించగా...దాన్ని హారీస్ డ్రైవ్ చేయబోయాడు. కానీ బంతి వేగానికి బ్యాట్ విరిగిపోయింది. ఆ తర్వాత బంతికే హారీస్ ను అఫ్రిది క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ మ్యాచ్లో లాహోర్ కలాండర్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ కలాండర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 241 పరుగులు చేసింది. ఓపెనర్ ఫకర్ జమాన్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. షఫీక్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 రన్స్ కొట్టాడు. వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు 47 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత 242 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పెషావర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. సయీమ్ అయూబ్ (51), కాడ్మోర్ (55), భానుక రాజపక్స (24), రొవ్మన్ పావెల్ (20) లు రాణించారు. షాహీన్ అఫ్రిది 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.