డైనోసార్ల స్పీడ్ గంటకు 4.6 కిలోమీటర్లే!

డైనోసార్లు.. భూమి మీద గతించిన  చరిత్ర. ఎప్పుడో ఆరేడు కోట్ల సంవత్సరాల క్రితం అమెరికా ప్రాంతంలో బతికిన జీవులవి. భూమిపైన జీవించిన అతి పెద్ద జంతువులవే. వీటిపై సైంటిస్టులు ఎన్నో ఏండ్లుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. చూడడానికి భయంకరంగా ఉండే డైనోసార్లపై వచ్చిన హాలీవుడ్ సినిమాలు వాటిని మనకు కళ్లకు కట్టాయి. సైంటిస్టులు కూడా వాటిని త్రీడీ రికన్‌‌స్ట్రక్షన్ చేసి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. నెదర్లాండ్స్‌‌ సైంటిస్టులు చేసిన స్టడీలో డైనోసార్లకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు. డైనోసార్లు మనుషుల కంటే వేగంగా పరిగెత్తలేవని, వాటి రన్నింగ్ స్పీడ్ గంటకు 4.6 కిలోమీటర్లు మాత్రమేనని తేల్చారు. కింగ్‌‌ ఆఫ్ డైనోసార్‌‌‌‌గా చెప్పే టీరెక్స్‌‌ను త్రీడీ రికన్‌‌స్ట్రక్షన్ చేయడం ద్వారా దాని శరీరం బ్యాలెన్సింగ్ వంటి వాటిని అంచనా వేసి ఈ వేగాన్ని లెక్కగట్టారు.

40 అడుగుల పొడవు.. 12 అడుగుల ఎత్తు
డైనోసార్ల కింగ్‌‌గా చెప్పే టిరనోసారస్ రెక్స్‌‌ను సైంటిస్టులు టీరెక్స్ అని కూడా పిలుస్తారు. ఇది సుమారు 6.8–6.6 కోట్ల ఏండ్ల క్రితం భూమిపై బతికినట్లు సైంటిస్టుల అంచనా వేస్తున్నారు. ప్రస్తుత అమెరికాలోని పశ్చిమ భాగంలో ఇవి ఉండేవట. డైనోసార్ల జాతిలోనే అతి పెద్ద సైజులో 12 అడుగుల ఎత్తు, అడ్డంగా తల నుంచి తోక భాగం వరకు 40 అడుగుల పొడవు ఉండేవని టీరెక్స్‌‌కు సంబంధించి ఎన్నో ఏండ్లుగా ఇప్పటి వరకు దొరికిన వాటి శిథిలావశేషాల ఆధారంగా సైంటిస్టులు చెబుతున్నారు. దాని అస్థిపంజరం సైజును బట్టి అది 6 టన్నుల బరువు ఉండేదని అంచనా వేశారు. శరీరంలో ఉండే అన్ని భాగాల బరువును అంచనా వేసి దాని ప్రకారమే త్రీడీ మోడల్‌‌ను రీకన్‌‌స్ట్రక్షన్ చేసి నెదర్లాండ్స్ సైంటిస్టులు టీరెక్స్ వేగాన్ని అంచనా వేశారు.

మనుషుల​ వాకింగ్ స్పీడ్‌‌తో సమానం
నెదర్లాండ్స్‌‌లోని మ్యూజియం న్యూరాలిసిస్‌‌లో అనాటమిస్ట్ అయిన పాషా వన్ బిజ్లెర్ట్‌‌, ఆయన టీమ్ కలిసి టీరెక్స్‌‌ మీద స్టడీ చేశారు. ఆ మ్యూజియంలో ఉండే టీరెక్స్ అస్థిపంజరం ఆధారంగా బయోమెకానికల్ మోడల్‌‌ను త్రీడీ రీకన్‌‌స్ట్రక్షన్‌‌ చేశారు. రెండు కాళ్లతో నడిచే ఈ భారీ జీవి దాని తల బరువును, తోక స్వింగ్ ద్వారా బ్యాలెన్స్ చేసుకునేదని బిజ్లెర్ట్ చెబుతున్నారు. దాని కాళ్లపై ఆరు టన్నుల శరీరం బరువును తగ్గించుకునేందుకు ఈ టెక్నిక్ ఉపయోగపడేదని, అలా ప్రతి అడుగును మెకానికల్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అడుగులేయడం వల్ల గంటకు 4.6 కిలోమీటర్లకు దాటి ఎక్కువ దూరం వెళ్లలేవని త్రీడీ మోడల్ టెస్ట్ రన్‌‌లో తేలిందని చెప్పారు. ఇది ఒక రకంగా మనిషి వాకింగ్ స్పీడ్‌‌తో సమానమని ఆయన అన్నారు. అయితే గతంలో ఉన్న కొన్ని స్టడీల్లో టీరెక్స్ రన్నింగ్ స్పీడ్‌‌ను 8 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఆ స్టడీలన్నీ టీరెక్స్ సహా అన్ని రకాల జాతుల డైనోసార్లను ఒకే గాటన కట్టి చేసినవేనని బిజ్లెర్ట్ అన్నారు. తమ స్టడీలో టీరెక్స్ శరీర బరువు, ఇతర బాడీ పార్ట్స్, తోక, కాళ్లు, ఇతర భాగాల్లోని ఎముకలు, వాటి సస్పెన్షన్ తీరు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ఈ స్పీడ్‌‌ను లెక్కగట్టామని చెప్పారు. టీరెక్స్ నడకలో దాని తోక భాగం చాలా ఇంపార్టెంట్ పార్ట్ అని, దాని శరీరంలో సగానికిపైగా పొడవు అదే ఉందని, దాని బరువు ఒక టన్ను వరకు ఉంటుందని అన్నారు. మిగిలిన శరీర భాగాన్ని బ్యాలెన్స్ చేస్తూ కాళ్లపై ఎక్కువ భారం పడకుండా ఒక బౌన్సింగ్ రబ్బర్ బ్యాండ్‌‌లా తోక పని చేసేదని బిజ్లెర్ట్ చెప్పారు.