ఆత్మీయ సమ్మేళనంలో రచ్చకెక్కుతున్న విభేదాలు
బీఆర్ఎస్లో గందరగోళం
ఆయా చోట్ల తప్పని నిలదీతలు, విమర్శలు
ఆదిలాబాద/నిర్మల్/ఆసిఫాబాద్ వెలుగు : అందరినీ కలుపుకొనిపోదాం అంటూ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలు ఉమ్మడి జిల్లాలో గందరగోళంగా మారుతున్నాయి. చాలామంది అసంతృప్తి నేతలు, సీనియర్లు సమావేశాలకు రావడం లేదు. వచ్చిన వారిలో కొందరు ఎమ్మెల్యేలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మరికొన్ని చోట్లా పోటాపోటీగా వేర్వేరు వర్గాల నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ లో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో వర్గ పోరు బయట పడుతోంది.
నిర్మల్ లో మంత్రిపైనే విమర్శలు
జల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు ఆహ్వానం అందలేదు. దీంతో మంత్రి, ఎమ్మెల్యేలపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆహ్వా నాలు పంపినా ఉద్దేశపూర్వకంగా కొంతమంది నేతలు హాజరు కావడం లేదంటూ ఎమ్మెల్యే, మంత్రుల అనుచరులు చెబుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీహరి రావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ శోభ భర్త సత్యనారాయణ గౌడ్, సారంగాపూర్ జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మారుతి, కడెం జడ్పీటీసీ అలెగ్జాండర్ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవడం లేదు.
ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన శ్రీహరి రావు ఇటీవల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై మండి పడ్డారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించే నైతిక హక్కు మంత్రికి లేదన్న కామెంట్లు పార్టీలో కలకలం రేపాయి. కార్యకర్తలను మంత్రి అణచివేస్తున్నాడని ఆరోపించారు.
ఆసిఫాబాద్ మీటింగ్‌లో సమస్యల ఏకరువు
ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం ఇటీవల పట్టణంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ చైర్మన్ కోవ లక్ష్మీ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు హాజరయ్యారు. ఆత్మీయంగా జరగాల్సిన ఈ మీటింగ్ లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు సమస్యలను ఏకరువు పెట్టారు. చేసిన పనులకు బిల్లలు రాక, పనులు చేయలేకపోతున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో కార్యకర్తలు సంతోషంగా లేరని, అయినా సంతోషంగా ఉన్నట్టు చెప్పుకోవాల్సి వస్తోందని ఈదులవాడ సర్పంచ్ భీమేశ్ బహిరంగానే అన్నారు. పనులు చేసినా బిల్లులు వస్తలేవని ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ నిలదీశారు. మరోవైపు పది హేను ఏండ్లుగా పార్టీలో పని చేస్తున్నా ఎలాంటి గుర్తింపు లేదని పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇస్తామన్న నామినేటెడ్ పదువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బోథ్ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీపీ
బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు పోటా పోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బాపురావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. అదే రోజూ ఎంపీపీ తుల శ్రీనివాస్ పోటీగా మరో సమావేశం నిర్వహించారు. బోథ్‌లో జరిగిన ఈ మీంటింగ్కు మాజీ ఎంపీ నగేశ్ వస్తారని ఆశించినా.. ఆయన కనిపించలేదు. ఎంపీపీ శ్రీనివాస్ సమావేశం నిర్వహించే ఫంక్షన్ హాల్ కు పోలీసులు తాళం వేయడంతో సీరియస్ అయింది. ఎంపీపీ వర్గీయులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా ఇన్చార్జి గంగాధర్ గౌడ్ ముందే ఎమ్మెల్యేకు, ఎంపీపీకి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. గత కొంత కాలంగా వీరి మధ్య తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నప్పటికీ ఎవరూ తగ్గడం లేదు. తాము నిర్వహిస్తున్న సమ్మేళనాలకే రావాలంటూ ఈ నేతలిద్దరు కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నారు. అటు మాజీ ఎంపీ గొడం నగేశ్ సైతం పార్టీ చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగాఉంటున్నారు. అయితే పదేళ్ల నుంచి బోథ్ లో ప్రభుత్వ పథకాల్లో అవినీతి జరుగుతోందని ఎంపీపీ తుల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం లేపుతున్నాయి.
దళితబంధు ఆగిందని, తమకు ఆత్మీయ సమ్మేళనాలకు పిలవడం లేదని అందుకే తామే సొంతంగా పార్టీ కార్యకర్తలకు మీటింగ్ పెడుతున్నామని అన్నారు. ఎమ్మెల్యే ప్రోగ్రానికి కైకిలి ఇచ్చి మరీ జనాన్ని తీసుకెళ్తున్నారని, చిల్లర పనులు చేస్తే తరిమికొడతాంటూ ఘాటు కామెంట్లే చేశారు.
ఆత్మీయత కరువు..
ఆత్మీయ సమ్మేళనాలకు సీనియర్ నాయకులు రాకున్నా ఎమ్మెల్యేలు వారిని పట్టించుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించే మీటింగ్ లకు ఉద్దేశ్యపూర్వకంగానే ఆహ్వానించడం లేదని పలువురు నేతలు అంటున్నారు. అసంతృప్తి వాదులతో చర్చలు జరిపేందుకు ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు దృష్టి పెట్టడం లేదు. పైగా ఈ పంచాయితీ అంతా హైకమాండ్ చూసుకుంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసంతృప్తి నాయకులు చేసిన విమర్శలపై మాట్లాడవద్దంటూ కార్యకర్తలకు తమ నేతలు ఆదేశించడం గమనార్హం. ఏదేమైనా.. బీఆర్ఎస్ లీడర్లంతా కలిసి ఉండి, ప్రతిపక్షాలను ఓడించేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్టు చెప్తున్నా నేతల మధ్య ఆత్మీయ కనిపించడం లేదు.