- రూ.కోట్ల ఖర్చుతో ట్రాక్ వేసిన్రు.. వృథాగా పెట్టిన్రు..
- ఇదీ.. మెదక్ స్పోర్ట్స్ స్టేడియం పరిస్థితి
మెదక్, వెలుగు : మెదక్ పట్టణంలోని స్పోర్ట్స్ స్టేడియంలో అన్నీ సౌకర్యాలు ఉన్నా అకాడమీలు లేవు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సింథటిక్ ట్రాక్, స్టేట్, నేషనల్ టోర్నమెంట్ నిర్వహించే కెపాసిటీ ఉన్న విశాలమైన గ్రౌండ్, స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఉండేందుకు హాస్టల్ బిల్డింగ్ లాంటి ఫెసిలిటీలు అన్నీ ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాల కిందటే ఈ స్టేడియం నిర్మాణం మొదలైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2000లో పనులు కంప్లీట్ చేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు స్టేడియాన్ని ఓపెన్ చేశారు.
అప్పుడు బాక్సింగ్, అథ్లెటిక్ అకాడమీలను ఏర్పాటు చేయడంతోపాటు రెండు ఈవెంట్లలో స్టేట్ లెవల్ టోర్నమెంట్లు నిర్వహించారు. ఆ తర్వాత సరైన వసతులు లేవన్న సాకు చూపి బాక్సింగ్ అకాడమీని హైదరాబాద్కు తరలించారు. క్రీడాకారులు ప్రాక్టీస్ చేసేందుకు సరైన ట్రాక్ లేదని చెప్పి అథ్లెటిక్ అకాడమీని కూడా హైదరాబాద్ కే మార్చారు. ఈ క్రమంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖేలో ఇండియా స్కీం కింద మెదక్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.5.50 కోట్లు శాంక్షన్ చేసింది. 2018లో ఈ ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.
400 మీటర్ల పొడవు, 8 లైన్లతో ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో నిర్మించిన సింథటిక్ ట్రాక్ 2019లో కంప్లీట్ అయ్యింది. ట్రాక్ మధ్యలో ఉన్న ఓపెన్ గ్రౌండ్లో ఫుట్ బాల్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ.70 లక్షలతో స్టేడియం బిల్డింగ్, హాస్టల్, గ్యాలరీలకు రిపేర్లు చేసి రినోవేషన్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ అకాడమీలు రాకపోవడంతో కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సింథటిక్ ట్రాక్, లక్షలు ఖర్చు చేసి రినోవేషన్ చేసిన స్టేడియం ఆశించిన విధంగా ఉపయోగించుకోవడం లేదు. అథ్లెటిక్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్ బాల్ అకాడమీలు ఏర్పాటు చేస్తేనే స్టేడియం పూర్తి స్థాయిలో ఉపయోగపడనుంది. ఇప్పటికైనా అకాడమీలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
అకాడమీలు ఏర్పాటు చేయాలి
మెదక్ స్పోర్ట్స్ స్టేడియం నుంచి హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియానికి తరలించిన అథ్లెటిక్ అకాడమీని తిరిగి ఇక్కడికి రప్పించాలి. సింథటిక్ ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నందున టెంపరరీగా అక్కడికి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. కానీ ట్రాక్ పనులు పూర్తయి నాలుగేళ్లవుతున్నా మళ్లీ అకాడమీ ఇక్కడికి రాలేదు. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ వృథాగా మారింది. అథ్లెటిక్ అకాడమీతో పాటు వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్ అకాడమీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ విషయాన్ని ఆదివారం స్టేడియం సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల దృష్టికి కూడా తీసుకెళ్లాం.
– యజుబేర్ అహ్మద్, మెదక్ జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రపోజల్స్ పంపించాం
మెదక్ స్పోర్ట్స్ స్టేడియంలో అథ్లెటిక్, వెయిట్ లిఫ్టింగ్, ఫుట్బాల్ అకాడమీల ఏర్పాటు కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్)కు ప్రపోజల్స్ పంపించాం. గతంలో ఇక్కడ అథ్లెటిక్స్ సెలెక్షన్స్ నిర్వహిచారు. చాలా రోజులైనందున మరోసారి సెలెక్షన్స్ నిర్వహిస్తాం. సాయ్ నుంచి అప్రువల్ వస్తే అకాడమీలు ఏర్పాటు చేస్తాం.
– శరత్ చంద్ర యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్