- లడఖ్ కు భర్త.. అరుణాచల్ కు భార్య ట్రాన్స్ ఫర్
- ఢిల్లీలో ఐఏఎస్ దంపతుల నిర్వాకం.. కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: పెంపుడు కుక్కతో కలిసి స్టేడియంలో వాకింగ్ చేయడానికి ఇద్దరు ఐఏఎస్ దంపతులు ఏకంగా ప్రాక్టీస్ చేస్తున్న అథ్లెట్లను పంపించేశారు. ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో సదరు ఆఫీసర్లను కేంద్రం చెరో చోటికి బదిలీ చేసింది. స్టేడియంలో రోజూ రాత్రి 8.30 దాకా ప్రాక్టీస్ చేయాల్సిన అథ్లెట్లను కొన్నిరోజులుగా 7 గంటలకే పంపించేస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సంజీవ్ ఖిర్వార్, ఆయన భార్య రింకు ధుగ్గా పెంపుడు కుక్కను ట్రాక్ పై వదిలి వాకింగ్ చేస్తున్నారు. అథ్లెట్లు, కోచ్ ఫిర్యాదు చేయడంతో వీరి నిర్వాకం బయటపడింది. దీంతో గురువారం కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. భర్తను లడఖ్ కు, భార్యను అరుణాచల్ ప్రదేశ్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. ఐఏఎస్ దంపతుల తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా స్పందించారు. ఇకపై ఢిల్లీలోని అన్ని స్టేడియాలను కేవలం అథ్లెట్ల కోసమే రాత్రి 10 గంటల దాకా తెరిచి ఉంచాలని ఆదేశించారు.