పేపర్ల లీకేజీపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ విచారణ?
ఒకట్రెండు రోజుల్లో కమిషన్‌లోనే ప్రశ్నించే చాన్స్
లీగల్ ఒపీనియన్ తీసుకున్న సిట్
ఈ నెల 11న కోర్టుకు రిపోర్ట్ ఇవ్వనున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు : టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన లీగల్ ఒపీనియన్‌ను సిట్అధికారులు తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో కమిషన్‌లోనే ఆయనను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గ్రూప్1 పేపర్ ప్రిపరేషన్, పేపర్స్ కమిషన్‌కు వచ్చిన తర్వాత ఎవరి కస్టడీలో ఉన్నాయనే వివరాలను సేకరించనున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన రిపోర్ట్‌ను ఈ నెల 11న కోర్టుకు సిట్ అందించనుంది.
మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ బాధ్యత ఎవరిది?
ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మందిలో ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఏఈ పేపర్ లీకేజీలో ముగ్గురిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకోనున్నారు. కస్టడీలో నిందితులు ఇచ్చిన సమాచారం అధారంగా పేపర్ కస్టోడియన్ శంకరలక్ష్మి, టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, కమిషన్ మెంబర్ లింగారెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.
ఈ క్రమంలోనే కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం కూడా తీసుకోనున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ బాధ్యత ఎవరిదనే వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నట్లు తెలిసింది. సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి అయినప్పటికి కస్టోడియన్ ఎవరి నేతృత్వంలో పనిచేస్తున్నారని తెలుసుకోనుంది.
చైర్మన్, శంకరలక్ష్మి చేతిలోనే కాన్ఫిడెన్షియల్ డేటా
కాన్ఫిడెన్సియల్ సెక్షన్ యాక్సెస్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, శంకరలక్ష్మికి మాత్రమే ఉంటుం దని విచారణలో సెక్రటరీ వెల్లడించినట్లు సమాచారం. దీంతో కస్టోడియన్ సెక్షన్ గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు సిట్ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే చైర్మన్‌ను విచారించాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్1 పేపర్ సహా అన్ని పేపర్స్‌కు సంబంధించిన మాస్టర్ పేపర్స్ శంకరలక్ష్మి కస్టడీలో ఉంటాయని ఇప్పటికే సిట్ నిర్ధారణకు వచ్చింది. శంకరలక్ష్మికి యాక్సెస్ ఉన్న కీ లాకర్ భద్రతపై చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను సేకరించే అవకాశాలు ఉన్నాయి.
ఏఈ పేపర్ లీక్‌లో ముగ్గురి కస్టడీకి చాన్స్
లీకైన ప్రశ్నపత్రాలతో ఏఈ పరీక్ష రాసిన ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌తోపాటు మీడియేటర్ తిరుపతయ్య కస్టడీపై కోర్టు తీర్పు వెలువడే అవకాశాలున్నాయి. ఈ ముగ్గురిని సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. తిరుపతయ్య కాంట్రాక్టర్ కావడంతో తనకు తెలిసిన వారందరికి పేపర్ లీకేజీ విషయం చెప్పి ఉంటాడని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏఈ పేపర్ ఇంకా ఎంత మందికి చేరిందనే వివరాలను ఈ ముగ్గురి నిందితుల కస్టడీలో సిట్ రాబట్టనుంది.