​‘భద్రకాళి’ సర్క్యూట్ పనులు స్పీడప్.. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రభుత్వం చర్యలు

​‘భద్రకాళి’ సర్క్యూట్ పనులు స్పీడప్.. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రభుత్వం చర్యలు

వరంగల్​, వెలుగు: ఓరుగల్లులో 600 ఏండ్ల కాలంనాటి భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ఫోకస్​పెట్టింది. సిటీ మధ్యలో ఎత్తైన కొండపై, సువిశాలమైన చెరువు ఒడ్డున ఉండే టెంపుల్​కొన్నేండ్లుగా అభివృద్ధికి నోచుకోవడంలేదు. 6 నెలల్లోనే అభివృద్ధి చేస్తామంటూ బీఆర్ఎస్​హయాంలో 2022లో పనులు మొదలు పెట్టారు. సర్కారు దిగిపోయే నాటికి అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని టెంపుల్ ను టూరిజం​సర్య్కూట్​గా చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆలయం చుట్టూ కొండలు, పార్కులు ఉండగా.. మూడు నాలుగు కిలోమీటర్ల పరిధిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. 

 తొలి దశలో రూ. 30 కోట్లు మంజూరు

గ్రేటర్​వరంగల్​తూర్పు, పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లకు వారధిగా నిలిచే ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణానికి కావాల్సిన అనుమతులతో పాటు తొలిదశలో రూ.30 కోట్లు మంజూరు చేసింది. అయితే.. మూడు దిక్కులా కొండ, చెరువు, లోయ ఉండడంతో నిర్మాణ పనులకు అడ్డంకిగా మారింది. 

వానాకాలంలో భారీ వర్షాలు పడడంతో పనులు స్లో అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గత ఆదివారం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి, అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆలయ మాడవీధులు, రాజగోపు రాల నిర్మాణ పనుల తీరును ఇన్ చార్జ్ మంత్రి స్వయంగా పరిశీలించారు. ఆగమ శాస్త్రం ప్రకారం పనులు త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

 చెరువులో పూడికతీతకు ఆదేశం 

ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేలా 380 ఎకరాల్లో విస్తరించిన చెరువును కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. వరదల కారణంగా చెరువులో మట్టి పేరుకుపోతుండడంతో లోతు తగ్గింది. వానాకాలం తప్ప వేసవిలో జలకళ కనిపించదు. దీంతో పూడికతీత తీయించాలని ఇన్ చార్జ్ మంత్రి అధికారులను ఆదేశించారు. 

ఇందుకు అవసరమైన ప్లాన్ వెంటనే రూపొందించడమే కాకుండా త్వరలోనే పనులు చేపట్టాలని సూచించారు.  తద్వారా  చెరువును తాగునీటికి అనుకూలంగా మార్చాలని తెలిపారు. చెరువు ఎఫ్​టీఎల్​ పరిధి హంటర్​రోడ్, పద్మాక్షి టెంపుల్​వైపు భారీగా భూకబ్జాలు జరిగిన నేపథ్యంలో సర్వే చేయించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి స్పష్టంచేశారు. 

పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి 

 సిటీ మధ్యలో ఎత్తైన ప్రదేశంలో ఉండే భద్రకాళి టెంపుల్ ను ఆనుకుని ఉండే చెరువుకు హనుమకొండ వైపు పద్మాక్షి ఆలయ కొండలు.. హంటర్​రోడ్​వైపు ఆహ్లాదకరమైన భద్రకాళి బండ్​ఉంది. రెండో విడత అభివృద్ధి పనులు సైతం కొద్దిరోజులుగా స్పీడప్ అయ్యారు. మాడ వీధులు, చెరువు పూడికతీత పూర్తయితే భద్రకాళి టెంపుల్​నుంచి బోట్​ద్వారా బండ్​కు చేరుకోవచ్చు. అమ్మవారి దర్శనంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా త్వరలోనే తీర్చిదిద్దనున్నారు.