న్యాయ చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా కొన్ని రకాల ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. పరీక్షల దశలో హైకోర్టు తీర్పులు, న్యాయపరమైన చిక్కుల కారణంగా లక్షలాది మంది అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. అందుకే తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​కమిషన్​ నోటిఫికేషన్ జారీ చేసేముందే ప్రభుత్వంతో చర్చలు జరపాలి, న్యాయ నిపుణులను సంప్రదించి ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిబంధనలు రూపొందించాలి. హారిజెంటల్, వర్టికల్ రిజర్వేషన్ వివాదాలతో గ్రూప్1 భర్తీ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందారు. ఈ మధ్యే కోర్టు తీర్పు వల్ల తదుపరి పరీక్ష ప్రక్రియ కొనసాగనున్నది. అలాగే జూనియర్​లెక్చరర్ల భర్తీ, గ్రూప్​4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన టీఎస్​పీఎస్సీ, దరఖాస్తు చేసుకోమని ముందు ఒక తేదీ ఇచ్చి, మళ్లీ సాంకేతిక లోపాలంటూ వాయిదా వేసింది.

ముందస్తు సన్నద్ధత, కసరత్తు లేకుండా, రోస్టర్ రెడీ చేయకుండానే వెబ్​నోటు రిలీజ్​చేయడం, నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా రాబోయే అన్ని నోటిఫికేషన్లు ఒక వారం ఆలస్యం అయినా, న్యాయ నిపుణులతో చర్చించి వివాదాలు లేకుండా జారీ చేయాలి. త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. టెట్ ముగిసి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు టీచర్ల భర్తీ పోస్టులకు(టీఆర్టీకి) ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. దీంతో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు స్కూళ్లలో కూడా టీచర్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నోటిఫికేషన్​ ఇవ్వాలి. 

- రావుల రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం